గత కొన్ని నెలలుగా భారత జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. స్వదేశంలో న్యూజీలాండ్ చేతిలో వైట్‌వాష్.. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరు గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉందని, ఈ ఆరు నెలల్లో ఏమైంది? అని ప్రశ్నించారు. పేరున్న ఆటగాళ్లని కాకుండా.. బాగా ఆడే ప్లేయర్లనే ఎంపిక చేయాలని సూచించారు. జస్ప్రీత్ బుమ్రా లేకుంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 0-5, 0-4తో ఓటమిపాలయ్యేది హర్భజన్ పేర్కొన్నారు.
‘రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నంత కాలం అంతా సజావుగానే సాగింది. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ సాధించింది. టీ20 ప్రపంచకప్ 2024 కూడా గెలిచింది. కానీ ఉన్నపళంగా టీమిండియాకు ఏమైంది?. నాకు ఏమీ అర్థం కావడం లేదు. గత ఆరు నెలల్లో శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయాం, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయ్యాం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయాం. ఇప్పుడు అంతా పతనమైనట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడికి పాపులారిటీ, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అయితే ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే లాంటి పెద్ద మ్యాచ్ విన్నర్లను కూడా జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు చెప్పారు. భారత్ సూపర్‌స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలి’ అని హర్భజన్ సింగ్ అన్నారు.
‘అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేశారు. కానీ ఒక్క మ్యాచ్‌లోనూ అతడిని ఆడించలేదు. సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి ఇంతే. ఇప్పటికైనా పేరున్న ఆటగాళ్లని కాకుండా.. బాగా ఆడే ప్లేయర్లనే ఎంపిక చేయాలి. జస్ప్రీత్ బుమ్రా లేకుంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 0-5తో కోల్పోయేది. పెర్త్ టెస్టులో భారత జట్టును బుమ్రానే కాపాడాడు. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను లేకపోతే భారత్ పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చారు.