NTV Telugu Site icon

Haj Flights from Vijayawada: హజ్‌ యాత్రికులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. విజయవాడ నుంచి విమానాలు..

Haj

Haj

Haj Flights from Vijayawada: ముస్లింలు హజ్ ‍యాత్ర పవిత్రంగా భావిస్తారు.. తమ జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్రకు వెళ్లాలని తాపత్రయపడతారు.. అయితే, హజ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే హజ్‌ యాత్రకు విమానాలు ఉండేవి.. కానీ, విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ ఏర్పాటు కావడంతో జూన్ 7వ తేదీ నుంచి విజయవాడ నుంచి హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. 2014 తర్వాత తొలిసారి హజ్ యాత్రికుల కోసం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి.. గన్నవరం నుంచి జెడ్డా చేరుకోనున్నాయి విమానాలు.

జూన్ 9వ తేదీన 155 మంది హజ్ యాత్రికులతో వెళ్లనుంది మొదటి విమానం.. ఇక, జూన్ 17వ తేదీ వరకు రోజు ఒకటి చొప్పున హజ్‌ యాత్రికులతో వెళ్లనున్నాయి విమానాలు.. ఇక, ఆ తర్వాత 22వ తేదీ వరకు మరిన్ని విమాన సర్వీసులు పెంచనున్నారు.. జూన్ 7వ తేదీన ఉదయం 9 గంటలకు బయల్దేరనున్న విమానం.. మధ్యాహ్నం 2.45 గంటలకు జెడ్డా చేరుకోనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్తుండేవారు ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులు.. కానీ, ఇకపై నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.. 2023 జూన్ 7 నుంచి నుండి 2023 జూన్ 19 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజూ విజయవాడ నుంచి 155 మంది హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇక, 1,813 మంది హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.80,000 ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరులోని మదరసాలో వసతి కల్పించారు. అక్కడి నుంచి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుస్తారు.. అయితే, ఏపీలో తొలిసారి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా.