Assam Murder Case: అస్సాం రాజధాని గువాహటిలో వెలుగుచూసిన 25 ఏళ్ల రియా తాలుక్దార్ గోస్వామి దారుణ హత్య కేసు ఇటు పోలీసులను, అటు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పెళ్లయిన కేవలం ఆరు నెలలకే భర్త రామానుజ్ గోస్వామి తన భార్యను అత్యంత ఘాతుకంగా హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. బసిష్ఠాపూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఈ దంపతులు ఫోన్లు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి సమయానికి పోలీసులు తలుపులు తెరిచి చూడగా, ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలు, చిందర వందరగా పడిన వస్తువులతో భయానక దృశ్యం కనిపించింది. రియా మొండెం నుంచి తల వేరుబడి ఉండటమే కాకుండా, కట్ చేసిన ఆమె తలను ఫ్రిజ్‌లోని ఒక నల్లటి పాలిథిన్ కవర్‌లో దాచి ఉంచడం అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చేతి వేళ్లను కూడా దారుణంగా నరికేశాడు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన పదునైన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. విచారణలో నిందితుడు రామానుజ్ చెప్పిన విషయాలు మరింత భయంకరంగా ఉన్నాయి. భార్యను నరికి చంపిన తర్వాత, ఆ మృతదేహాన్ని తన పెంపుడు కుక్కకు ఆహారంగా తినిపించాలని ప్లాన్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ కుక్క ప్లాన్‌పై నిజానిజాలు తేలాల్సి ఉందని, దీనిపై ఇంకా విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తబ్బు రామ్ పేగు స్పష్టం చేశారు. భార్యను అంతమొందించినందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని చెప్పడమే కాకుండా, జైలు నుంచి బయటకు వస్తే తన భార్య ‘షుగర్ డాడీ’ అని భావిస్తున్న వ్యక్తిని కూడా చంపేస్తానని నిందితుడు బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడు. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానమే ఈ నరరూప రాక్షసుడి పగకు, హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
మరోవైపు నిందితుడు రామానుజ్ తీవ్రమైన మత్తు పదార్థాల వ్యసనపరుడని, ఇప్పటివరకు 20 సార్లు కంటే ఎక్కువగానే రిహ్యాబిలిటేషన్ సెంటర్లకు వెళ్లి వచ్చాడని తేలింది. అంతేకాకుండా అతనికి హెచ్‌ఐవీ, హెపటైటిస్-సి వంటి తీవ్ర వ్యాధులు కూడా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. అయితే ఈ అనారోగ్య సమస్యలకు హత్యకు ప్రత్యక్ష సంబంధం ఉందో లేదో పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం సీఐడీ, ఫోరెన్సిక్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. అస్సాంను వణికించిన ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు నిజాలు, మృతదేహాన్ని కుక్కకు వేయాలనే ఘోరమైన ప్లాన్ నిజమేనా కాదా అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే బయటకు రానుంది.

