NTV Telugu Site icon

Exam Cancelled: జూనియర్ క్లర్క్ పరీక్ష పేపర్ లీక్.. ఎగ్జామ్‌ రద్దు

Exam

Exam

Exam Cancelled: గుజరాత్‌లో జూనియర్ క్లర్క్‌ల నియామకం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్‌ అయింది. దీంతో ఆదివారం పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందే ఎగ్జామ్‌ను రద్దు చేశారు. ప్రశ్నాపత్రం లీక్‌ కావడానికి సంబంధించి అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాష్ట్ర పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2,995 కేంద్రాల్లో 1,181 పోస్టులకు జరగాల్సిన పరీక్షకు 9.5 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రశ్నాపత్రం లీక్‌ అయిందని తెలిసి పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం పరీక్షా ప్రశ్నపత్రం కాపీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అభ్యర్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరీక్షను వాయిదా చేయాలని నిర్ణయించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

జూనియర్ క్లర్క్ (అడ్మినిస్ట్రేటివ్/అకౌంటింగ్) పరీక్ష జనవరి 29న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య వివిధ జిల్లాల్లో నిర్వహించాల్సి ఉంది. ఆదివారం తెల్లవారుజామున పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ప్రశ్నాపత్రం కాపీని స్వాధీనం చేసుకున్నారని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ పరీక్షా కేంద్రాలకు వెళ్లవద్దని బోర్డు తెలియజేసింది. పరీక్ష వీలైనంత త్వరగా నిర్వహించబడుతుందని, దీని కోసం బోర్డు కొత్త ప్రకటనను జారీ చేస్తుందని తెలిపింది.

Gold Biscuits: లగేజ్ బ్యాగ్ లో బిస్కెట్లు.. తినేవి కాదండోయ్‌

గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి మాట్లాడుతూ.. ఇది 15వ ప్రభుత్వ పోటీ పరీక్ష అని, ఇది గత 12 ఏళ్లలో ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దు చేయబడిందని విమర్శించారు.ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెబుతున్నా ప్రధాన నిందితులను కూడా అరెస్టు చేయలేదని, రాష్ట్ర యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. 2016లో మొదటి ప్రకటన జారీ చేసిన పరీక్షను మూడో సారి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు ఇసుదన్ గాధ్వీ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు. గుజరాత్‌లో అనేక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం వల్ల రాష్ట్రంలోని యువతలో ఆందోళన నెలకొందన్నారు. గత నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ఈ అంశంపై కాంగ్రెస్, ఆప్ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరీక్ష పేపర్ల లీక్‌కు వ్యతిరేకంగా పదేళ్ల జైలు శిక్షతో కఠినమైన చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.