Site icon NTV Telugu

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో విజయం.. ఫోర్బ్స్ ప్రశంసల వర్షం

Forbes

Forbes

Green India Challenge: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ చేప‌ట్టిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీద ప్రత్యేక వ్యాసాన్ని డిసెంబర్‌ సంచికలో ప్రచురించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్-బిల్డింగ్ బెటర్ టుమారో పేరిట ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రచురించింది. మొక్కలు ఎంత ఎక్కువగా పెంచితే పర్యవరణం అంత రమణీయంగా ఉంటుందని, స్వచ్చమైన ఆక్సీజన్ తో పాటు పర్యావరణం కూడా పచ్చగా ఉంటూ ఉత్తేజాన్ని కలిగిస్తుందనే లక్ష్యంతో ఎంపీ సంతోష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది ప్రముఖులు, కళాకారులు, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతోష్ ఛాలెంజ్‌ను స్వీకరించి మరొకరికి ఇదే ఛాలెంజ్ ని విసిరిని సందర్బాలు అనేకం ఉన్నాయి.

ప్రముఖ నటుడు ప్రభాస్‌తో కలిసి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన నాటి ఫోటోను ఈ కథనంలో పొందుపరిచింది. “ఎవరైతే మొక్కను నాటుతారో వారు విశ్వాసాన్ని పాదుకొల్చుతున్నట్టు” అని అమెరికా- కవి లూసీ లార్కర్ 19వ శతాబ్దంలో చెప్పిన మాటతో వ్యాసాన్ని ప్రారంభించింది ఫోర్బ్స్. రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన ఈ కార్యక్రమం లక్షల మందికి స్ఫూర్తినివ్వడమే కాకుండా హరిత యజ్ఞంలో లక్షల మందిని భాగస్వాములయ్యేలా చేసిందని ప్రశంసించింది. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకుడు చెట్లు నాటడమే కాకుండా.. స్నేహితులు, సెలబ్రిటీలను, బంధువులను.. ఇలా సమాజం మొత్తాన్ని భాగస్వాములయ్యేలా చేసిందని పేర్కొంది.

కీసరలో అడవిని దత్తత తీసుకుని 2వేలకు పైగా ఎకరాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా తద్వారా గిఫ్ట్ స్మైల్ ఛాలెంజ్కు శ్రీకారం చుట్టి కార్యక్రమాన్ని కొత్త పుంతలు తొక్కించారని ఫోర్బ్స్ పొగడ్తల వర్షం కురిపించింది. ఖాజీపల్లి రిజర్వ్ ఫారెస్టు బాహుబలి స్టార్ ప్రభాస్, హెటిరో ఫార్మా కంపెనీ, ప్రముఖ నటుడు నాగార్జున అడవులను దత్తత తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. అదే విధంగా సంతోష్ తీసుకువచ్చిన వృక్ష వేదం పుస్తకం ప్రాముఖ్యతను కూడా ఫోర్బ్స్ కొనియాడింది. వేదాలు, పురాతన గ్రంధాల్లో వివిధ రకాల వృక్షాలకు ఉన్న ప్రాముఖ్యతను, వాటి ఉపయోగాన్ని వివరించడమే కాకుండా.. కొన్ని మూలికలతో కూడిన చెట్లు మానవాళిక ఏ విధంగా ఉపయుక్తమవుతున్నాయీ వివరించిన తీరును ప్రస్తావించింది. కోటి వృక్షార్చన, విత్తన బంతులు తదితర కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అడవుల అభివృద్ధికి ఎంపీ సంతోష్ చేసిన కృషిని ఫోర్బ్స్ ప్రశంసించింది.

KCR Nutrition Kits: నేటి నుంచే కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ షురూ..

ఫోర్బ్స్ కథనంపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందించారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ మరో గొప్ప విజయాన్ని నమోదు చేసుకుందని ఆయన అన్నారు. ఫోర్బ్స్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్‌ ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా కథనాన్ని ప్రచురించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ కార్యక్రమం విజయానికి నోచుకోదన్నారు. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందితో కలిసి భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకమైందన్నారు. ఇది తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

Exit mobile version