NTV Telugu Site icon

Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్‌డీ తొలగింపు!

Minister Kollu Ravindra

Minister Kollu Ravindra

రాష్ట్ర ఎక్సైజ్‌, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఓఎస్‌డీగా ఉన్న పి.రాజబాబును ఆ పోస్టు నుంచి ప్రభుత్వం తొలగించింది. గనులశాఖపై ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. గత కొన్ని రోజులుగా రాజాబాబు ఆఫీసుకు కూడా హాజరుకావడం లేదు. ఓఎస్‌డీ పోస్టు నుంచి తప్పుకుంటానని ఆయన పేషీలో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కొంతమంది మంత్రుల ఓఎస్‌డీలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గనులశాఖలో జాయింట్‌డైరెక్టర్‌ (జేడీ)గా పనిచేసిన రాజబాబు ఏడాది కిందట ( 2024 మార్చి) పదవీ విరమణ చేశారు. జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గనులశాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు. కొల్లు రవీంద్రకు ఓఎస్‌డీ కోసం అన్వేషించగా.. అప్పట్లో పలువురు గనులశాఖ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. జేడీగా పనిచేసిన అనుభవం ఉండటంతో రాజబాబును ఓఎస్‌డీగా తీసుకున్నారు. గనులశాఖలో పనిచేసినప్పుడు రాజబాబుపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అలాంటి వారిని మంత్రి ఓఎస్‌డీగా ఎలా తీసుకుంటారని ప్రశ్నలు, విమర్శలు వచ్చినా నాడు మంత్రి లెక్కపెట్టలేదు.

మంత్రి కొల్లు రవీంద్ర వద్ద రాజబాబు ఇంతకాలం కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే గనుల శాఖలోని ఓ కీలక అధికారికి, రాజబాబుకు చాలాకాలంగా ఆధిపత్య పోరు ఉంది. రాజబాబు ఓఎస్‌డీ కావడంతో ఆ ఆధిపత్య పోరు తిరిగి కొనసాగింది. అదే సమయంలో మైనింగ్‌ లీజుల విషయంలో ఆయనపై పార్టీ పెద్దలకు కొందరు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. 10 నెలల పాలనలో గనులశాఖ పనితీరు, అప్పీల్‌ రివిజన్‌ కేసులపై అనేక ఆరోపణల నేపథ్యంలో.. స్వయంగా సీఎం చంద్రబాబు ఆ శాఖపై దృష్టి సారించారు. నివేదిక పరిశీలించిన అనంతరం ఓఎస్‌డీనే తప్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం తప్పించబోతోందన్న సమాచారంతోనే రాజబాబు కొన్ని రోజులుగా ఆఫీసుకు కూడా రావడం లేదు. సబ్ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస చౌదరిని మంత్రి ఓఎస్‌డీగా నియమించే అవకాశం ఉంది.