Site icon NTV Telugu

Governor Grandson Harassment: గవర్నర్ మనవడి భార్య వరకట్న ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు

Governor Grandson Harassmen

Governor Grandson Harassmen

కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి భార్య దివ్య గెహ్లాట్ వరకట్న వేధింపులు ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: IndiGo Flights: 200 ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దు.. ప్రయాణికులకు చుక్కలు

2018 ఏప్రిల్ 29న మధ్యప్రదేశ్‌లోని అలోట్‌లో ముఖ్యమంత్రి కన్యాదాన యోజన కింద దేవేంద్ర గెహ్లాట్-దివ్య గెహ్లాట్‌కు వివాహం జరిగింది. ఈ వేడుకకు అప్పటి కేంద్ర మంత్రి, మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సహా సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. దేవేంద్ర గెహ్లాట్.. థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు.

అయితే దివ్య గెహ్లాట్ అత్తారింట్లో అడుగుపెట్టాక నరకం మొదలైంది. అదనపుకట్నం కోసం నిత్యం వేధించడమే కాకుండా.. అప్పటికే దేవేంద్ర గెహ్లాట్ మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసైపోయాడు. ఇతరు మహిళలతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. దీంతో దివ్యకు కష్టాలు మొదలయ్యాయి. ఆనాటి నుంచి అదనంగా రూ.50లక్షలు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి.

దివ్య ఫిర్యాదు..
ప్రస్తుతం ఈ వ్యవహారం మధ్యప్రదేశ్‌లోని రత్లాం పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ దగ్గరకు చేరింది. తన నాలుగేళ్ల కుమార్తెను ఉజ్జయిని జిల్లాలోని నాగ్డాలో బలవంతంగా ఉంచారని.. వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని దివ్య లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. తక్షణ చర్చలు తీసుకోవడమే కాకుండా.. తనకు భద్రత కల్పించాలని దివ్య విజ్ఙప్తి చేసింది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, మైనర్ కుమార్తెను అపహరించడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

2021లో గర్భధారణ సమయంలోనూ వేధింపులు తీవ్రమయ్యాయని దివ్య పేర్కొంది. తనకు తరచుగా ఆహారం పెట్టేవారు కాదని.. కొట్టడమే కాకుండా.. మానసికంగా హింసించేవారని ఆరోపించింది. ఇక కూతురు పుట్టాక కూడా వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. 2019లో రాజీ ప్రయత్నం జరిగినప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మారలేదని.. మరింత దిగజారాయని వెల్లడించింది.

జనవరి 26న భర్త తాగి ఇంటికి తిరిగి వచ్చాక ఆ రాత్రి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో వివరించింది. దారుణంగా దాడి చేసి డబ్బు తీసుకురాకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని తెలిపింది. అనంతరం ఇంటి పైకప్పు నుంచి తోసివేసినట్లు వెల్లడించింది. గ్యాలరీలో పడిపోవడంతో వెన్నెముక, భుజం, నడుముకు తీవ్ర గాయాలయ్యాయని… ఆ రాత్రంతా తనకు వైద్య సహాయం అందించలేదని ఆమె ఆరోపించింది.

మరుసటి రోజు ఉదయం నాగ్డాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని.. పరిశీంచిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని నిర్ధారించి ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రికి రిఫర్ చేశారు. తన తల్లిదండ్రులకు ఎప్పుడూ సమాచారం ఇవ్వలేదని, వైద్య ఖర్చులు భరించాలని మాత్రం తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని దివ్య ఆరోపించింది.

4 ఏళ్ల కుమార్తెను బలవంతంగా అత్తమామలు ఉంచుకున్నారని.. కనీసం బిడ్డను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయింది. నవంబర్‌లో పాఠశాలకు వెళ్తే.. అక్కడ భర్త తనను అడ్డుకుని డబ్బు తీసుకొస్తేనే తప్ప కలిసేది లేదని హెచ్చరించాడని తెలిపింది.

దివ్య ఫిర్యాదు ప్రకారం.. భర్త దేవేంద్ర గెహ్లాట్ (33), మామ జితేంద్ర గెహ్లాట్ (55), అలోట్ మాజీ ఎమ్మెల్యే, బావమరిది విశాల్ గెహ్లాట్ (25), అమ్మమ్మ అనితా గెహ్లాట్ (60) రూ.50 లక్షల కట్నం డిమాండ్ చేస్తూ తనను చాలా సంవత్సరాలుగా వేధిస్తున్నారని పేర్కొంది.

ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గెహ్లాట్ స్పందిస్తూ..‘‘ఎవరైనా ఆరోపణలు చేయవచ్చు. నేను అన్ని వాస్తవాలను మీడియా ముందు పెడతాను.’’ అని అన్నారు. ప్రస్తుతం దివ్య రత్లాంలో తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది.

Exit mobile version