Dwcra Group: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా.. ప్రభుత్వం కీలక ప్రకటన..

  • సభ్యురాలి ప్రమాద మరణానికి రూ. 10 లక్షల బీమా సాయం..
  • సభ్యురాలు తీసుకున్న బ్యాంకు అప్పులకు రూ. 2 లక్షల వరకు రుణ బీమా..
  • దరఖాస్తుల జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశం
Ap New Dwcra Schemes 2026

Ap New Dwcra Schemes 2026

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక బీమా పథకాలు నేడు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న క్రమంలో వారికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ పథకాల అమలును వేగవంతం చేశారు. సాధారణంగా మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి బ్యాంకు రుణాలు పొందిన వారు అకస్మాత్తుగా మరణిస్తే.. ఆ రుణ భారం వారి కుటుంబంపై పడటమే కాకుండా.. మిగిలిన సంఘ సభ్యులపై కూడా ఆర్థిక ఒత్తిడి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు సదరు సంఘాలను బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల కొత్త రుణాలు అందక అనేక సంఘాలు మూతపడే పరిస్థితి ఏర్పడేది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ.. సభ్యురాలు మరణించినా ఆమె కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా ప్రభుత్వం రుణ బీమా, ప్రమాద బీమా సౌకర్యాలను కల్పిస్తోంది.

Also Read:Iran Attack on Saudi: సౌదీ అతిపెద్ద రిఫైనరి ‘‘అరామ్‌కో’’పై ఇరాన్ మళ్లీ దాడి..

ప్రమాదవశాత్తు మహిళా సంఘంలో సభ్యురాలు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల భారీ బీమా పరిహారాన్ని అందజేస్తున్నారు. 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 231 మంది బాధితుల కుటుంబాలకు 23 కోట్ల రూపాయలకు పైగా నగదును పంపిణీ చేయడం విశేషం. అదేవిధంగా.. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు రక్షణ కల్పించే రుణ బీమా పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు 3 వేల క్లెయిమ్స్ పరిష్కారమయ్యాయి. దీనికోసం ప్రభుత్వం 223 కోట్ల రూపాయలకు పైగా నిధులను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల లబ్ధిదారుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా.. బ్యాంకులకి మహిళా సంఘాలపై నమ్మకం పెరిగి తిరిగి పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.

Also Read:Telangana: రేషన్ కార్డుదారులకు తీపి కబురు.. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే బీమా సాయం అందజేయడంలో ఎక్కడా జాప్యం జరగకూడదని అన్ని జిల్లాల డీఆర్డీఓలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దరఖాస్తు అందిన వెంటనే దర్యాప్తు పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నిధుల కొరత లేకుండా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.150 కోట్లు అదనపు నిధులను కూడా కేటాయించారు. దీని వల్ల మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి.. ఆదాయ వనరులను మెరుగుపరుచుకోవడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు.