Gold Price Surge 2026: శాంతి సంకేతాల మధ్య గోల్డ్ రేట్ జంప్.. బంగారంపై పెట్టుబడి పెట్టొచ్చా..?

Gold

Gold

Gold Price Surge 2026: ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో తగ్గుతూ వచ్చాయమి బంగారం ధరలు.. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగి మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ఒకే ట్రేడింగ్ సెషన్‌లో సుమారు 4 శాతం పెరిగి ఔన్స్‌కు $4,550 దాటింది. గత కొన్ని రోజులుగా వరుసగా పడిపోతున్న బంగారం ధరలు, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు పెరగడంతో ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిలిచాయి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్‌ లో ఇంధన సరఫరాలకు సంబంధించిన ఒక ప్రతిపాదన ఇచ్చిందని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య చర్చలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌లో వేగంగా వ్యాపించాయి. అయితే, ఈ విషయంపై ఇరాన్ అధికారిక స్పందన ఇంకా రాలేదు.

Read Also: Varanasi-SS Rajamouli: రాజమౌళి విజన్‌కు అంతే లేదా?.. ‘వారణాసి’ సెట్స్‌తో మరో సంచలనం!

ఈ పరిణామాల ప్రభావంతో, వరుసగా తొమ్మిది రోజుల పాటు పడిపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తిరుగుబాటు చేశాయి. అయినప్పటికీ, పెద్ద దృశ్యంలో చూస్తే పరిస్థితి ఇంకా అస్థిరంగానే ఉంది. 2026 జనవరిలో ఔన్స్‌కు $5,626 గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పటికీ దాదాపు 20 శాతం తగ్గిన స్థాయిలోనే ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకులు ఈ పరిస్థితిని “భారీ ఊగిసలాట”గా అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వార్తల ప్రభావంతో మార్కెట్ తీవ్రంగా మార్పులు చూపుతోందని పేర్కొంటున్నారు.. యుద్ధ భయాల నుంచి శాంతి ఆశల వైపు మార్కెట్ మూడ్ మారడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని చెబుతున్నారు..

ఈ ర్యాలీ వెనుక ప్రధాన కారణం పెట్టుబడిదారుల ధోరణి మార్పేనని అభిప్రాయపడుతున్నారు.. బంగారం పడిపోతుందని భావించి షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్లు ఇప్పుడు వాటిని మూసివేయడంతో ధరలు పైకి వెళ్లాయి. అదనంగా, ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై దాడులు తగ్గే అవకాశం, చమురు ఆధారిత ద్రవ్యోల్బణ భయాలు తగ్గడం, డాలర్ బలహీనత వంటి అంశాలు కూడా బంగారానికి మద్దతు ఇచ్చాయి. ముందు రోజుల్లో ఔన్స్‌కు $4,600 స్థాయి కీలకంగా మారనుంది. ఈ స్థాయిని దాటితే బంగారం ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఈ స్థాయిని నిలబెట్టుకోలేకపోతే మళ్లీ $4,100 వరకు పడిపోయే ప్రమాదం ఉంది.

ఇక ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం ఇప్పటికీ సేఫ్ హెవెన్‌గా పనిచేస్తుందా అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. పరిశోధన నిపుణురాలు Dr. Renisha Chainani ప్రకారం, ప్రస్తుతం మార్కెట్‌లో లిక్విడిటీ ప్రభావం ఎక్కువగా ఉంది. సాధారణంగా జియోపాలిటికల్ టెన్షన్స్ సమయంలో బంగారం పెరుగుతుంది. కానీ ఈసారి పెట్టుబడిదారులు అవసరాల కోసం తమ ఆస్తులను విక్రయించడం వల్ల విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆమె వివరించారు. మొత్తానికి, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం మార్కెట్ తీవ్ర అనిశ్చితిలో ఉంది. శాంతి చర్చలు నిజంగా ప్రారంభమవుతాయా లేదా అనే అంశం రాబోయే రోజుల్లో బంగారం ధరల దిశను నిర్ణయించనుంది.