ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. దీంతో మ్యాక్సీ 13 ఏళ్ల వన్డే కెరీర్ ముగిసింది. ఫైనల్ వర్డ్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంను వెల్లడించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా తరపున 2012లో వన్డేల్లోకి అడుగుపెట్టిన 36 ఏళ్ల మాక్స్‌వెల్.. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి టెస్టులకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక మాక్స్‌వెల్ కేవలం టీ20ల్లో మాత్రమే ఆడనున్నాడు.
యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్లెన్ మాక్స్‌వెల్ వెల్లడించాడు. పదే పదే గాయాల బారిన పడడం కూడా మాక్సీ రిటైర్మెంట్‌కు ప్రధాన కారణం. 149 వన్డేలు ఆడిన మాక్స్‌వెల్ 4,000 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. వన్డేల్లో మ్యాక్సీ అత్యధిక స్కోర్ 201 నాటౌట్. వన్డేల్లో 77 వికెట్లు కూడా పడగొట్టాడు. ఆస్ట్రేలియా తరపున చివరి వన్డే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. 2015, 2019, 2023లో ఆస్ట్రేలియా ప్రపంచకప్ సాధించడంలో మాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్తాన్‌పై మాక్సీ ఆడిన ఇన్నింగ్స్ హైలెట్. గాయం అయినా ఒంటి కాలితో అఫ్గానిస్తాన్‌పై డబుల్ సెంచరీ బాది ఆస్ట్రేలియాను సెమీఫైనల్‌కు చేర్చాడు.
ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా స్టార్స్ అందరూ రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 జనవరిలో డేవిడ్ వార్నర్, 2024 అక్టోబర్‌లో మాథ్యూ వేడ్, 2025 ఫిబ్రవరిలో మార్కస్ స్టోయినిస్, 2025 మార్చిలో స్టీవ్ స్మిత్ రిటైర్ అయ్యారు. తాజాగా గ్లెన్ మాక్స్‌వెల్ వీడ్కోలు పలికాడు. దాంతో 2026 వన్డే ప్రపంచకప్‌కి ఆసీస్ కొత్త జట్టుని సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొందరు జట్టులో స్థానం సంపాదించారు.
