Glass Symbol Tension: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌గా ఉండటంతో.. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో.. కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. బెజవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట, కైకలూరు, మైలవరం, మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరడంతో ఫ్రీ సింబల్‌గా ఉన్న జనసేన గుర్తును ఇచ్చారు. కీలక స్థానాల్లో గాజు గ్లాసు కేటాయించడంతో కూటమి పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు.
తిరుపతి జిల్లాలోకూడా పలువురు స్వతంత్రులకు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు. శ్రీకాళహస్తీ ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు గాజు గ్లాసు ఇచ్చారు. మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషా గాజు గ్లాసు కోరడంతో ఆయనకూ కేటాయించారు. చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్ధికి సైతం గ్లాసు సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. నగరిలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ జయరామయ్యకు గ్లాసు గుర్తు వచ్చింది. ఇక… కడప జిల్లాలో ఇద్దరు స్వతంత్రులకు గాజు గ్లాసు సింబల్ దక్కింది. మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గాజు సింబల్ కేటాయించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసుగుర్తు కేటాయించారు. డోన్, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసుగుర్తు కేటాయించింది ఈసీ.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థలకు కూడా గాజు గ్లాస్ గుర్తు దక్కింది.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి
గుర్తింపు పొందిన పార్టీల నుండి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉండగా 9మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.. పాలపర్తి జాన్ సన్ అనే స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించారు. ఏలూరు జిల్లా చింతలపూడి లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మువ్వల ఎస్తేరు రాణికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తును కేటాయించారు. రాజంపేట పార్లమెంటులో ఎట్టకేలకు పులి శ్రీనివాసులు అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి కూడా గాజు గ్లాసు గుర్తు దక్కింది. పల్నాడు జిల్లా
మాచర్ల , వినుకొండ అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్ అభ్యర్థులకు, గుంటూరు జిల్లా మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి , గుంటూరు పశ్చిమ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి, గుంటూరు పార్లమెంట్లో నవతరం పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తులు కేటాయించారు ఎన్నికల అధికారులు..
ఇక, అనంతపురం జిల్లాలో మూడు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు.. తాడిపత్రి, రాప్తాడు, గుంతకల్లు అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దక్కింది.. విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ సీట్లలో ఇండి పెండెంట్లకు గాజు గ్లాస్ కేటాయించారు. జనసేన ఓట్ బ్యాంక్ ఎక్కువగా వున్న గాజువాక, భీమిలిలో సింబల్ దక్కించుకున్నారు స్వతంత్రులు… అనకాపల్లి ఎంపీకి కృష్ణ స్వరూప్ కు గ్లాస్ సింబల్ దక్కింది. ఉమ్మడి కడప జిల్లాలో ని మైదుకూరు, కమలాపురం రాజంపేట ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించింది. పెద్దాపురం, జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. తిరుపతి జిల్లాలో నాలుగు చోట్లా.. శ్రీకాళహస్తి,
మదనపల్లె, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, మచిలీపట్నం, కైకలూరులోనూ.. విజయవాడ పార్లమెంటు స్థానం నవతరం పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఈసీ అధికారులు..
వాస్తవంగా.. గాజు గ్లాస్ జనసేన సింబల్.. ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశం ఉంది. దాంతో ఎన్ని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఐతే…సింబల్‌తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడింది జనసేన. కూటమిగా 10 శాతానికి పైగా సీట్లల్లో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇతరులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తోంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.