NTV Telugu Site icon

Union Budget 2023: ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీర..ఎవరు గిఫ్ట్‌ ఇచ్చారంటే!

Nim1

Nim1

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ సమయంలో అయితే ఆమె కట్టే చీర కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో ఈరోజు (ఫిబ్రవరి 2) ఆమె ఏ రంగు చీరతో 2023-24 బడ్జెట్‌ను సమర్పిస్తుందా అని అందరి దృష్టి దానిపైనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైన రంగులను ఇష్టపడతారు. నిర్మలమ్మకు చేనేత చీరలంటే మక్కువ ఎక్కువ. జనవరి 26న, నార్త్ బ్లాక్‌లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించారు. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ఎక్కువగా సంబల్‌పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంటారు. తాజాగా నేడు బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు. ఆమె 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజున చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ‘సిల్క్‌, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి. వాటి రంగు, నేతపని, ఆకృతి బాగుంటాయి’ అని వెల్లడించారు.

Also Read: Modi on Union Budget: కేంద్ర బడ్జెట్ గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే!

కాగా, నేడు బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ కట్టుకున్న చీరను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 2022లో మెరూన్‌ రంగు చీరను ధరించారు సీతారామన్. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అలాగే 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇక 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్‌ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు. ఇక 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు.

Also Read: Union Budget 2023: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నది