ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. అద్దె వసూలు చేసేందుకు వెళ్లిన ఓ ఇంటి యజమానురాలు హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఘజియాబాద్‌లోని ఓరా కైమోరా సొసైటీలో నివసిస్తున్న దీపశిఖ శర్మ కుటుంబానికి రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఒక ఫ్లాట్‌లో ఆమె తన కుటుంబంతో కలిసి నివసిస్తుండగా, మరో ఫ్లాట్‌ను ఆకృతి, అజయ్ అనే భార్యాభర్తలకు అద్దెకు ఇచ్చింది. అయితే గత నాలుగు నెలలుగా వారు అద్దె చెల్లించకపోవడంతో, దాన్ని వసూలు చేసేందుకు దీపశిఖ బుధవారం సాయంత్రం అద్దెకున్న వారి ఫ్లాట్‌కు వెళ్లింది.
సాయంత్రం వెళ్లిన దీపశిఖ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో పనిమనిషికి అనుమానం వచ్చి అద్దెకున్న ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడగా, అక్కడి దృశ్యం ఆమెను షాక్‌కు గురిచేసింది. దీపశిఖ శర్మ మృతదేహం రక్తపు మడుగులో సూట్‌కేసులో కుక్కబడి ఉండటాన్ని గమనించి వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి నిందితులైన ఆకృతి, అజయ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో, ఆ భార్యాభర్తలు సుమారు ఏడాది క్రితం ఆ ఫ్లాట్‌లోకి అద్దెకు వచ్చినట్టు వెల్లడైంది. అద్దె చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, దీపశిఖ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో సొసైటీలో భయాందోళనలు నెలకొన్నాయి.
