Site icon NTV Telugu

Ghattamaneni Family : ఘట్టమనేని మూడో తరంలో స్టార్‌ అయ్యేదెవరు?

Ghattamaneni

Ghattamaneni

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘సూపర్ స్టార్’ అనే పదానికి నిలువెత్తు రూపం కృష్ణ. ఆయన వారసత్వాన్ని సెకండ్ జనరేషన్‌లో మహేశ్‌ బాబు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రమేశ్‌ బాబు 15 సినిమాల్లో నటించినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. మంజుల కూడా నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ‘ఘట్టమనేని మూడో తరం’ పైనే ఉంది. ఈ తరంలో అందరూ నటీనటులుగానే వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతున్నారు.

రమేశ్‌ బాబు కుమారుడు జయకృష్ణ ఇప్పటికే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో మహేశ్‌ బాబు సినిమా ‘నిజం’లో చిన్నప్పటి మహేశ్‌గా నటించిన జయకృష్ణ ఇప్పుడు ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ కూతురు రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

ఘట్టమనేని ఆడపడుచులు కూడా నటనపై ఆసక్తి చూపిస్తున్నారు. రమేశ్‌ బాబు కూతురు భారతి ఇప్పటికే సోషల్ మీడియాలో తన డాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి, త్వరలోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంజుల కూతురు జాన్వీ స్వరూప్‌ ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె బర్త్‌డే సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే జాన్వీ కూడా వెండితెర అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

సితార – గౌతమ్ లపై భారీ అంచనాలు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు పిల్లలు సితార, గౌతమ్ లపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఇప్పటికే ‘సర్కారువారి పాట’ ప్రమోషనల్ సాంగ్‌లో మెరిసి, సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె త్వరలోనే వెండితెరపైకి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక గౌతమ్ కృష్ణ, ‘నేనొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి, ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తున్నాడు. త్వరలోనే అతడు పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ వారసుడిగా నిరూపించుకోవాలని ఘట్టమనేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version