NTV Telugu Site icon

General Elections 2024 Live Updates : సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్‌ లైవ్‌ అప్డేట్స్‌

Polling Day

Polling Day

10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాలకు 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.73 కోట్ల మంది మహిళలతో సహా మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లను సులభతరం చేసేందుకు ఎన్నికల సంఘం 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల వద్ద 19 లక్షల మందికి పైగా ఎన్నికల అధికారులను మోహరించింది. నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పరిశీలకులు, మానిటరింగ్ బృందాలను నియమించారు. దేశంలో మొదటి మూడు దశల్లో ఓటింగ్ జరిగింది. మొదటి మూడు దశల్లో వరుసగా 66.14శాతం, 66.71శాతం, 65.68శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

The liveblog has ended.
  • 13 May 2024 07:11 PM (IST)

    దేశవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్

    దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. దేశవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్.. పశ్చిమ బెంగాల్‌లో 75.66 శాతం, ఉత్తరప్రదేశ్‌ 56.35 శాతం, మహారాష్ట్రలో 52.49 శాతం పోలింగ్ నమోదు.. బీహార్‌లో 54.14 శాతం, జమ్మూకశ్మీర్‌లో 35.75 శాతం, జార్ఖండ్‌లో 63.14 , మధ్యప్రదేశ్‌లో 68.01 శాతం, ఒడిశాలో 62.96 శాతం పోలింగ్ నమోదు.

  • 13 May 2024 06:17 PM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికి ఛాన్స్‌

    తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్‌లో నిల్చున్న వారికి.. సమయం ముగిసినా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. అతి సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 5 గంటలకు ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.

  • 13 May 2024 05:32 PM (IST)

    తెలంగాణలో 5 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు తెలిపారు.

     

  • 13 May 2024 05:25 PM (IST)

    పాతబస్తీ మీర్‌ చౌక్‌ వద్ద ఉద్రిక్తత

    తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఊహించని విధంగా ఒకే రూట్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. రెండు వాహనాలు ఒకే రూట్‌లో రావడంతో గందరగోళం నెలకొంది.

    కోట్ల అలీజ బిబికా బజార్ చౌరస్తా వద్ద హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను పాతబస్తీ వాసులు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటూ మాధవీలత పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే జోక్యం చేసుకొని యువకులను అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు. వారిని అక్కడి నుంచి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

  • 13 May 2024 04:49 PM (IST)

    జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన మహేశ్‌ బాబు, రామ్‌చరణ్

    తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత రామ్ చరణ్, మహేశ్ బాబు కూడా ఓటు వేశారు. సూపర్ స్టార్‌ మహేశ్ బాబు, నమ్రత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఓటేశారు. మహేశ్‌ బాబును చూసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. మేం ఓటు వేశాం... మీరు కూడా ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి జూబ్లీ క్లబ్‌లో పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. చరణ్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. అందరూ బయటకు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. యువకులు అధికంగా ఓటు వేయాలని రామ్‌ చరణ్ పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ్నించి రామ్ చరణ్, ఉపాసన వెళ్లిపోయారు.

     

  • 13 May 2024 04:39 PM (IST)

    ఆ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

    తెలుగు రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయం ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది.

  • 13 May 2024 03:25 PM (IST)

    3 గంటల వరకు తెలంగాణలో 52.30 శాతం పోలింగ్

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • 13 May 2024 03:07 PM (IST)

    ఓటు వేసిన హీరో విశ్వక్‌ సేన్‌!

    'మాస్ కా దాస్' విశ్వక్‌ సేన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సీసీలో ఆయన ఓటు వేశారు.

  • 13 May 2024 02:33 PM (IST)

    ఉప్పల్‌లో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లి మహిళ మృతి!

    హైదరాబాద్ ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన ఓ మహిళ గుండె పోటుతో మృతి చెందింది. భరత్ నగర్‌కి చెందిన విజయ లక్ష్మి.. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారు. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

  • 13 May 2024 02:10 PM (IST)

    హైదరాబాద్‌లో 20 శాతం పోలింగ్!

    హైదరాబాద్‌లో 20 శాతం పోలింగ్‌ నమోదైందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్‌ స్లిప్‌లను పరిశీలించడం కోడ్‌ ఉల్లంఘనే అంటూ ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి మీద వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశామని వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.

  • 13 May 2024 02:01 PM (IST)

    ఓటు వేసిన హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ!

    హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ రాంనగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం తనకి ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. దేశ భ‌విత‌ను మార్చేందుకు ఓటు హ‌క్కు చాలా కీల‌క‌మైన‌ద‌ని పేర్కొన్నారు.

  • 13 May 2024 01:56 PM (IST)

    బీజేపీ అభ్యర్థి మధవీలతపై కేసు నమోదు!

    హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మధవీలతపై మలక్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్‌ తొలగించి అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేశారు.

  • 13 May 2024 01:56 PM (IST)

    మధ్యాహ్నం 1 గంట వరకు 40.32 శాతం ఓటింగ్ నమోదు..

    లోక్ సభ నాలుగో దశలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంటల వరకు 40.32 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 13 May 2024 01:48 PM (IST)

    అధికారంలోకి తీసుకురాగలం.. పదవి నుంచి దించగలం: జ్వాలా గుత్తా

    హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం జ్వాలా గుత్తా మాట్లాడుతూ... 'ఓటు వేయడం మన హక్కు. ప్రజలు అందరూ వచ్చి ఓటేయండి. ఓటు చాలా పవర్ ఫుల్. ఓటుతో అధికారంలోకి తీసుకురాగలం, దేశానికి మరియు సమాజానికి మంచి చేయకుంటే పదవి నుంచి దించగలం అని అధికారంలో ఉన్న వారికి ఓ సందేశం ఇవ్వొచ్చు' అని అన్నారు.

  • 13 May 2024 01:34 PM (IST)

    ఓటు వేసిన హీరో నాని!

    హీరో నాని ఓటు వేశారు. గచ్చిబౌలి ఎంపీపీ స్కూల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాని సతీమణి అంజన కూడా ఓటు వేశారు.

  • 13 May 2024 01:29 PM (IST)

    సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు!

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘం (ఈసీ)కి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది.

  • 13 May 2024 01:24 PM (IST)

    మధ్యాహ్నం 1 వరకు 40.13 శాతం పోలింగ్!

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.13 శాతం పోలింగ్ నమోదైంది.

  • 13 May 2024 01:18 PM (IST)

    జనగామలో ఉద్రిక్త పరిస్థితి!

    జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్‌లోకి కాంగ్రెస్‌ యువజన నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి వెళ్లడంతో ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ప్రశాంత్ రెడ్డి లోపలిఐ వెళ్లగా.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో.. పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురు వర్గాలను చెదరగొట్టారు.

  • 13 May 2024 01:13 PM (IST)

    ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: రేవత్ రెడ్డి

    హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటర్ల గుర్తింపు కార్డులను పోలింగ్ బూత్‌లలో తనిఖీ చేస్తున్న వీడియోపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం సీఎంను మీడియా ప్రశ్నించగా.. తాను ఇంకా వీడియో చూడలేదన్నారు. కానీ బీజేపీ కేవలం ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోందని సీఎం అన్నారు.

  • 13 May 2024 12:52 PM (IST)

    ఐడీ కార్డులు తనిఖీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత!

    హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఈ క్రమంలో ఆమె స్వయంగా ఐడీ కార్డులు తనిఖీలు చేశారు.

  • 13 May 2024 12:46 PM (IST)

    ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి: సి.పార్థసారధి

    తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి సి.పార్థసారధి బంజారాహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో శక్తిమంతమైన ఓటు ఆయుధాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఐదేళ్ల మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే అని గుర్తుపెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • 13 May 2024 12:16 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌!

    జహీరాబాద్ బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

  • 13 May 2024 12:03 PM (IST)

    ఓటు వేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

    తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటు వేశారు. కోదాడ పట్టణం గ్రేస్ స్కూల్లో 182వ నెంబరు పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కూడా ఓటు వేశారు.

  • 13 May 2024 11:55 AM (IST)

    ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగికి గుండెపోటు!

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి శ్రీకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

  • 13 May 2024 11:50 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు దేశవ్యాప్తంగా 24.87 శాతం పోలింగ్ నమోదు..

    లోక్‌సభ ఎన్నికల 4వ దశలో ఉదయం 11 గంటల వరకు 24.87 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 13 May 2024 11:43 AM (IST)

    11 గంటల వరకు పోలింగ్‌ శాతం!

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలను ఈసీ వెల్లడించింది. ఏపీలో 23 శాతం, తెలంగాణ 24.31 శాతం నమోదు అయింది.

  • 13 May 2024 11:33 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్!

    తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతమడకలోని కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుటుంబ సమేతంగా వచ్చి కేసీఆర్.. ఓటు వేశారు.

  • 13 May 2024 11:25 AM (IST)

    కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి!

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి గీతతో కలిసి కొడంగల్‌లో సీఎం ఓటు వేశారు. ఓటు వేయడం కోసం సీఎం హైదరాబాద్ నుంచి కొడంగల్‌కు వెళ్లారు.

  • 13 May 2024 11:19 AM (IST)

    హైదరాబాద్‌లో ఓటేసిన కేటీఆర్‌!

    బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్‌ ఓటేశారు. కేటీఆర్‌ సతీమణి, కుమారుడు కూడా ఓటేశారు.

  • 13 May 2024 11:10 AM (IST)

    నేను ముంబై నుంచి వచ్చా.. హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి ఫైర్!

    హైదరాబాద్ ఓటర్లపై సినీనటి మంచు లక్ష్మి ఫైర్‌ అయ్యారు. హైదరాబాద్ సిటీలో ఇప్పటి వరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటు అని అన్నారు. 'హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటు. నేను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ముంబై నుంచి వచ్చాను. కానీ హైదరాబాద్‌లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటికి రాకపోవడం దారుణం. నగర ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయాలి' అని మంచు లక్ష్మి అన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీలో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మి ఓటర్లపై మండిపడ్డారు.

  • 13 May 2024 10:58 AM (IST)

    కొడంగల్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి!

    లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొడంగల్‌కు బయలుదేరారు. కొడంగల్‌లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో సీఎం తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • 13 May 2024 10:56 AM (IST)

    'మీ ఓటు హైదరాబాద్‌లో మార్పు తెస్తుంది' మాధవీ లత

    ఓటు వేసిన అనంతరం హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవి లత మాట్లాడుతూ మీ ఓటు తెలంగాణ, హైదరాబాద్‌లో మార్పు తెస్తుందని అన్నారు.

  • 13 May 2024 10:55 AM (IST)

    ఓటు వేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు!

    తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు ఓటు వేశారు. సిద్దిపేటలోని అంబిటస్‌ స్కూల్‌లో తన సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు.

  • 13 May 2024 10:52 AM (IST)

    'మహిళలకు లక్ష ఇస్తాం' : సోనియా గాంధీ కీలక ప్రకటన

    లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో మహిళలు పెద్దన్న పాత్ర పోషించారని అన్నారు. నేడు మహిళలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కాంగ్రెస్ విప్లవాత్మకమైన హామీని తీసుకొచ్చాం. కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబానికి చెందిన మహిళకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు అందజేస్తామన్నారు.

  • 13 May 2024 10:51 AM (IST)

    ఓటు వేసిన మంచు హీరోలు!

    కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు కుటుంబసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్‌ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్‌లు హైదరాబాద్‌లో ఓటు వేశారు.

  • 13 May 2024 10:48 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న నాగ చైతన్య!

    టాలీవుడ్ హారో నాగ చైతన్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమెన్ కోపేరేటివ్ డవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రంలో చై ఓటు వేశారు.

  • 13 May 2024 10:30 AM (IST)

    ఓటు వేసిన తుమ్మల నాగేశ్వరరావు!

    వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. ఖమ్మం గొల్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 10:24 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 10.35 శాతం పోలింగ్ నమోదు..

    ఉదయం 9 గంటల వరకు దేశవ్యాప్తంగా 10.35 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 13 May 2024 10:22 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న వీ హ‌నుమంత‌రావు!

    కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబర్ పేటలో హ‌నుమంత‌రావు ఓటు వేశారు.

  • 13 May 2024 10:20 AM (IST)

    ఓటు వేసిన డాక్టర్ కే లక్ష్మణ్!

    రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఓటు వేశారు. చిక్కడపల్లి శాంతినికేతన్ గ్రౌండ్ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 10:17 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!

    బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలంపూర్‌లోని 272వ పోలింగ్ బూత్‌లో ప్రవీణ్ కుమార్ ఓటు వేశారు.

  • 13 May 2024 10:15 AM (IST)

    ఓటు వేసిన రఘునందన్ రావు!

    మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటు వేశారు. అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో రఘునందన్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 10:13 AM (IST)

    ఓటు వేసిన నామా నాగేశ్వరరావు!

    బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఓటు వేశారు. ఖమ్మంలోని కవితా డిగ్రీ మెమోరియల్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నామా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు.

  • 13 May 2024 10:08 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి కుటుంబం!

    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయలు షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఓట్లు వేశారు.

  • 13 May 2024 10:05 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్!

    ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్ చీరేక్ పబ్లిక్ స్కూల్‌లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు.

  • 13 May 2024 09:45 AM (IST)

    Pankaja Munde: 400 సీట్లను సాధిస్తాం..

    మహారాష్ట్ర బీడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న పంకజా ముండే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ 400 సీట్లు సాధించాలని ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఎన్డీయే 400 సీట్లను దాటుతుందని ఆమె చెప్పారు.

  • 13 May 2024 09:41 AM (IST)

    సమస్యలు ఉంటే 1950కి ఫిర్యాదు చేయండి!

    ఎలక్షన్‌ మానిటరింగ్ టీమ్‌తో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్‌ రాజ్‌ భేటీ అయ్యారు. ఈవీఎంల మొరాయింపు, ఫిర్యాదులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలని వికాస్‌ రాజ్ సూచించారు.

  • 13 May 2024 09:39 AM (IST)

    ఉదయం 9.30 గంటల వరకు 9.5 శాతం పోలింగ్!

    తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9.30 గంటల వరకు 9.51 పోలింగ్ శాతం నమోదు అయినట్లు ఈసీ అధికారులు తెలిపారు.

  • 13 May 2024 09:35 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

    చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు వేశారు. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 274లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 13 May 2024 08:59 AM (IST)

    ఓటు వేసిన ప్రొఫెసర్ కోదండరాం దంపతులు!

    ప్రొఫెసర్ కోదండరాం దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో వారు ఓటు వేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరు బయటికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవాలి కోదండరాం అన్నారు.