Site icon NTV Telugu

Nepal Gen Z Party: నేపాల్‌లో జనరల్ జెడ్ కొత్త పార్టీ.. ఎన్నికల్లో పోటీ చేస్తుందా?

Nepal Gen Z Party

Nepal Gen Z Party

Nepal Gen Z Party: ప్రపంచ దేశాలపై నేపాల్ నిరసనల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నేపాల్‌లోని జనరల్ జెడ్ గ్రూప్ శనివారం తాము త్వరలో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయాలా వద్దా అనేది.. దేశంలో కొన్ని ప్రాథమిక షరతులు నెరవేరడంపై ఆధారపడి ఉంటుందని ఈ గ్రూప్ తెలిపింది.

READ ALSO: Nagarjuna : నాగార్జున దెబ్బకు కదిలిన బాలీవుడ్ హీరోలు..

మార్చి 5, 2026న ఎన్నికలు..
హిమాలయ దేశంలో మార్చి 5, 2026న ఎన్నికలు జరుగనున్నాయి. నేపాల్‌లో యువత నేతృత్వంలోని ఈ బృందం అవినీతికి వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించింది. సోషల్ మీడియా సైట్‌లపై ప్రభుత్వ నిషేధం విధించిన నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనల కారణంగా దేశంలోని కెపి శర్మ ఓలి నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు అయ్యింది. 1997 – 2012 మధ్య జన్మించిన తరాన్ని Gen Z అంటారు. ఇటీవల దేశంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ Gen Z ఉద్యమ నాయకులలో ఒకరైన మిరాజ్ ధుంగానా వాళ్ల ఎజెండాను ప్రకటించారు.

జనరల్ జెడ్ యువతను ఏకం చేయడానికి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తాము పరిశీలిస్తున్నప్పటికీ, వారి ప్రాథమిక డిమాండ్లు పరిష్కరించే వరకు ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ బృందం ప్రధానంగా రెండు కీలక అజెండాల అమలు కోసం డిమాండ్ చేస్తుంది. ప్రత్యక్షంగా ఎన్నికైన కార్యనిర్వాహక వ్యవస్థ, విదేశాలలో నివసిస్తున్న నేపాలీ పౌరులకు ఓటు హక్కులు కల్పించాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో అవినీతిని ఎదుర్కోవడానికి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి స్పష్టమైన విధానాన్ని స్వీకరించడానికి పౌరుల నేతృత్వంలోని దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని ధుంగనా వెల్లడించారు.

జాతి నిర్మాణ పనిలో అన్ని పార్టీల నుంచి సమిష్టి నిబద్ధత, సహకారం కోసం ఆయన పిలుపునిచ్చారు. “సుపరిపాలనను ప్రోత్సహించడం, పారదర్శకత, దేశంలో అవినీతిని అరికట్టడం వంటి అంశాల కోసం మేము పోరాడుతూనే ఉంటాము. జనరల్-జి యువత త్యాగాలను వృథాగా పోనివ్వము” అని ఆయన అన్నారు. కొత్త పార్టీకి తగిన పేరు కోసం ప్రస్తుతం వారు దేశంలో సూచనలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కోసం నేపాలీ యువత విదేశాలకు వలసలు పెరగడం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి నిలిచిపోయిందని చెప్పారు. ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించకపోవడంపై గత ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. “మన చుట్టూ మూడు బిలియన్ల జనాభా కలిగిన రెండు పొరుగు దేశాలు ఉన్నాయి. ఈ పొరుగు మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటూ మన దేశ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలి” అని ఆయన అన్నారు. మూసివేసిన పరిశ్రమలను తిరిగి తెరిచి కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.

దేశంలో ప్రతినిధుల సభకు ఎన్నికలు మార్చి 5న, 2026న జరగనున్నాయి. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సెప్టెంబర్ 12న ఎన్నికల తేదీని ప్రకటించి, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని దేశంలో ఏర్పాటు చేశారు.

READ ALSO: Dude : 2 రోజుల్లో 45 కోట్లు+కొట్టేశారు డ్యూడ్

Exit mobile version