Site icon NTV Telugu

CDS Anil Chauhan: సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చౌహాన్

Cds

Cds

CDS Anil Chauhan: భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుప‌మా చౌహాన్‌తో క‌లిసి ఆయ‌న ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వ‌చ్చారు. భార‌త రెండ‌వ సీడీఎస్‌గా కేంద్ర ప్రభుత్వం ఆయ‌నను నియ‌మించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) పదవిని అధికారికంగా స్వీకరించారు. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో అనిల్ చౌహాన్‌ సీడీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ అనిల్‌ చౌహాన్ విధులు నిర్వర్తించనున్నారు. భార‌త సైనిక ద‌ళాల్లో అత్యధిక ర్యాంకు ద‌క్కడం గ‌ర్వంగా ఉంద‌ని అనిల్ అన్నారు. త్రివిధ ద‌ళాల ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లుగా ప‌నిచేయ‌నున్నట్లు సీడీఎస్ అనిల్ చెప్పారు. అన్ని స‌వాళ్లను, అవ‌రోధాల‌ను క‌లిసిక‌ట్టుగా ఎదుర్కోనున్నట్లు ఆయ‌న వెల్లడించారు.

త్రివిధ దళాల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని అనిల్‌ చౌహాన్ అన్నారు. బాధ్యతలు చేపట్టకముందు అనిల్ చౌహాన్.. జాతీయ యుద్ధస్మారకం వద్ద తన తండ్రి సురేంద్ర సింగ్ చౌహాన్​తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సైనికుల గౌరవవందనాన్ని స్వీకరించారు. దాదాపు 40 ఏళ్లపాటు సైన్యంలో సేవలు అందించారు లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ చౌహాన్. అనేక కీలక పదవుల్లో పనిచేశారు. జమ్ముకశ్మీర్​, ఈశాన్య భారత్​లో తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకోవడంలో ఆయనకు విశేష అనుభవం ఉందని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.

Vande Bharat Express: హైస్పీడ్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

సీడీఎస్​ వ్యవస్థను కొన్నేళ్ల క్రితం తొలిసారి ఎన్​డీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 2020 జనవరి 1న జనరల్ బిపిన్ రావత్​ భారతదేశ తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. తమిళనాడులోని కూనూర్​ సమీపంలో 2021 డిసెంబర్​ 8న జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు.. అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసినట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్‌ వ్యవహరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Exit mobile version