Geetu Mohandas: కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups) సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌కు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండటమే అందరినీ అత్యంత ఆశ్చర్యానికి, ఆసక్తికి గురిచేస్తున్న ప్రధాన అంశం. చిన్నతనంలో మలయాళ చిత్రాల్లో బాలనటిగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత అవార్డులు సాధించిన స్వతంత్ర (ఇండిపెండెంట్) చిత్రాల దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు భారతీయ సినిమాలోనే అత్యంత భారీ యాక్షన్ చిత్రాలలో ఒకటైన ఈ సినిమాకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ అరుదైన సినీ ప్రయాణమే ‘టాక్సిక్’ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. అయితే.. ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకులు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైలెన్స్ ఎక్కువగా ఉందని చాలా మంది చెబుతున్నారు. ఈ తరుణంలో గీతు మోహన్‌దాస్‌కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. “నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి.. మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ” అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొందరు ఈ వీడియోను టాక్సిక్ సినిమాకు ముడిపెడుతున్నారు. కానీ.. ఈ వీడియో పాతదని తెలుస్తోంది.
అసలు ఎవరు ఈ గీతు మోహన్‌దాస్?
గీతు మోహన్‌దాస్ 1986లో మోహన్‌లాల్ సరసన ‘ఒన్ను ముతల్ పూజ్యం వరే’ అనే సినిమాతో అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి సినిమాలోనే అద్భుత నటనతో ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసి, 2000లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో కథానాయికగా మళ్లీ వెండితెరకు పరిచయమయ్యారు. తెన్కాశి పట్టణం, వాల్కన్నాడి, అమ్మాల్ తమ్మిల్, అకాలే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘అకాలే’ సినిమాలో ఆమె నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. అయితే కేవలం నటనకే పరిమితం కాకుండా, కథలు చెప్పడం, దర్శకత్వం వైపు ఆమె మనసు మళ్లింది. 2009లో ‘కేట్కున్నుండో?’ అనే షార్ట్ ఫిలింతో దర్శకురాలిగా మారిన ఆమె, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్‌లో ప్రదర్శన పొందడమే కాకుండా నేషనల్ ఫిల్మ్ అవార్డును సైతం కైవసం చేసుకున్నారు.
దర్శకురాలిగా ఆమె ప్రయాణంలో ‘లయర్స్ డైస్’ (Liar’s Dice – 2013), ‘మూథోన్’ (Moothon – 2019) అత్యంత కీలకమైన మైలురాళ్లు. గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘లయర్స్ డైస్’ రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా, సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై 87వ ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఆ తర్వాత నివిన్ పౌలీతో తీసిన ‘మూథోన్’ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. సాధారణంగా గీతు మోహన్‌దాస్ సినిమాలు మానవ సంబంధాలు, గుర్తింపు, భావోద్వేగాలు, విస్థాపన (displacement) వంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతాయి. కానీ ‘టాక్సిక్’ విషయానికి వస్తే పీరియడ్ బ్యాక్‌డ్రాప్, గ్యాంగ్‌స్టర్ కథాంశం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన పూర్తి విరుద్ధమైన ప్రపంచం ఇది. ఈ భారీ మార్పులో ఆమెకు తోడుగా నిలిచింది ఆమె భర్త, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. 2009లో వివాహం చేసుకున్న ఈ జంట, వినూత్నమైన క్రియేటివ్ పార్ట్‌నర్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. దేవదాస్ (Dev.D), గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, ఉడ్తా పంజాబ్ వంటి ఐకానిక్ చిత్రాలకు కెమెరామెన్‌గా చేసిన రాజీవ్ రవి, ‘లయర్స్ డైస్’ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రానికి కూడా ఆయనే సినిమాటోగ్రఫీ అందించారు.

