Ganesh Chaturthi 2025 Shubh Muhurat and Timings: ప్రతి సంవత్సరం వినాయక చవితి (గణేష్ చతుర్థి) భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తేదీన వస్తుంది. 10 రోజుల అనంతరం గణేష్ పండుగ అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఆగస్టు 27 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుంది. వినాయక చవితికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో.. గణనాథుడిని పూజించడానికి ఊరూ వాడా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో వినాయక చవితి పండుగ రోజు విగ్రహ ప్రతిష్టకు శుభ ముహూర్తం, పూజా విధానం తదితర విషయాలు ఓసారి తెలుసుకుందాం.
శుభ ముహూర్తం:
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని ఆగస్టు 27న జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి ఆగస్టు 26న మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 27న మధ్యాహ్నం 3:44 గంటల వరకు ఉంటుంది. వినాయక చవితి రోజున గణపతిని పూజించడానికి ఉత్తమ సమయం ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 01:40 వరకు ఉంది. దీని శుభ ముహూర్తం మొత్తం వ్యవధి 2 గంటల 34 నిమిషాలు. విగ్రహ ప్రతిష్టకు ఈ సమయం అత్యుత్తమమైనది అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. నియమ, నిష్టలతో పూజ చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.
పూజా విధానం:
వినాయక చవితి రోజు అందరూ ఉదయాన్నే నిద్రలేచి.. స్నానం తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి. మామిడాకు తోరణాలు, పూలతో ఇంటిని అలంకరించుకోవాలి. పీటకు పసుపు రాసి.. ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెట్టాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పేర్చుకోవాలి. ఆ తమలపాకులపై వినాయక విగ్రహాన్ని పెట్టాలి. ఆవు నెయ్యితో దీపాలు, అగరువత్తులు వెలిగించాలి. పాలవెల్లిని పసుపు, కుంకుమతో అలంకరించి.. మామిడాకుడులు కట్టి వినాయక విగ్రహంకు వేయాలి. పాలవెల్లికి నాలుగు వైపులా మొక్కజొన్న పొత్తులు, పూలు, పండ్లు, పత్రితో అలంకరించాలి. రాగి లేదా ఇత్తడి పాత్రకు పసుపు రాసి, అందులో నీళ్లు పోసి పైన కొబ్బరికాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. గణపతికి పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించాలి. ఆపై వినాయక వ్రతకల్పం చదివి పూజ పూర్తి చేయాలి.
మండపం వాస్తు:
గణేష్ మండపాల ఏర్పాటులో వాస్తును తప్పకుండా పాటించాలని పండితులు అంటుంటారు. తూర్పు లేదా ఉత్తరం దిక్కులో గణేశుడి ముఖం ఉండేట్టు చూసుకోవాలి.
చంద్రుడిని చూడకూడని సమయం:
గణేష్ చతుర్థి నాడు చంద్రుడిని చూడటం అశుభమని భావిస్తారు. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 27 వరకు చంద్రుడిని చూడటం నిషేధించబడింది. 26 ఆగస్టు 01:54 మధ్యాహ్నం నుంచి రాత్రి 08:29 వరకు.. 27 ఆగస్టు 09:28 ఉదయం నుంచి రాత్రి 08:57 వరకు చంద్రుడిని చూడకూడదు.
విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి శుభ సమయం:
గణేష్ విగ్రహాన్ని ఒక రోజు ముందు అంటే.. హర్తాళిక తీజ్ రోజున చాలామంది ఇంటికి తీసుకువస్తారు. ఆగస్టు 26న ఉదయం 9.9 నుంచి మధ్యాహ్నం 1.59 గంటల మధ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం మంచిది.
విగ్రహం జాగ్రత్తలు:
మట్టి గణపతి విగ్రహాన్ని కొనడం శుభప్రదం. వినాయకుడి తొండం ఎడమ వైపున ఉండాలి. ఇంట్లో అయితే కూర్చునే గణేశుడిని ప్రతిష్టించడం శుభప్రదం. తెలుపు రంగులో ఉండే గణేశుడి విగ్రహం కొనడం మంచిది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. విగ్రహం విరిగిపోకుండా జాగ్రత్త వహించాలి.
