Site icon NTV Telugu

Rules change November 1: ఆధార్ అప్‌డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు.. నవంబర్ 1 నుంచి మారే నియమాలు ఇవే

New Rules Nove1

New Rules Nove1

రేపటితో అక్టోబర్ నెల ముగియబోతోంది. ఎల్లుండి నుంచి అంటే శనివారం నుంచి నవంబర్ నెల ప్రారంభంకాబోతోంది. కాగా ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన మార్పులు జరగనున్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతాయి. ఈ మార్పులలో క్రెడిట్ కార్డుల నుంచి LPG వరకు నిబంధనలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆధార్ అప్‌డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు పలు రూల్స్ మారనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆధార్ అప్ డేట్

UIDAI ఆధార్ కార్డును అప్ డేట్ చేసే ప్రక్రియను సులభతరం చేసింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడానికి మీరు ఇకపై ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు. కానీ బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయడానికి ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. రేషన్ కార్డులు, MNREGA, PAN, పాస్‌పోర్ట్, పాఠశాల రికార్డులు వంటి ప్రభుత్వ డేటాబేస్‌లతో UIDAI మీ సమాచారాన్ని ఆటోమేటిక్ గా ధృవీకరిస్తుంది. దీనివల్ల పత్రాలను అప్‌లోడ్ చేయడంలో ఇకపై ఇబ్బందులు ఉండవు.

బ్యాంకింగ్ నిబంధనలలో మార్పులు

నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కస్టమర్లు ఇప్పుడు తమ బ్యాంకు ఖాతాలు, లాకర్లు, సేఫ్ కస్టడీ కోసం నలుగురు నామినీలను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నామినీకి ఎంత అందుతుందో కూడా కస్టమర్లు నిర్ణయించుకోవచ్చు.

LPG, CNG, PNG ధరలలో మార్పుకు అవకాశం

ప్రతి నెలా ఒకటో తేదీన LPG, CNG, PNG ధరలను కంపెనీలు సమీక్షిస్తాయి. ఎప్పటిలాగే, నవంబర్ 1న వీటిని సవరిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా చమురు కంపెనీలు ఈ ధరలను సవరిస్తాయి. ఈసారి, గ్యాస్ ధరల పెంపు లేదా తగ్గింపుకు అవకాశం ఉంది.

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో మార్పులు

నవంబర్ 1 నుంచి అన్‌సెక్యూర్డ్ కార్డ్‌లకు 3.75% ఛార్జ్ విధించనుంది. మీరు థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా స్కూల్ లేదా కాలేజీ ఫీజులు చెల్లిస్తే, మీకు అదనంగా 1% ఛార్జ్ చేస్తారు. అయితే, మీరు పాఠశాల అధికారిక వెబ్‌సైట్ లేదా దాని POS మెషీన్ ద్వారా చెల్లిస్తే, ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ. 1,000 కంటే ఎక్కువ వాలెట్ లోడ్ చేయడానికి 1% ఫీజు చెల్లించాలి.

Exit mobile version