Free Tea for Truck Drivers in Odisha: హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఉచితంగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి తుకుని సాహు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేస్తామని, ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా ట్రక్ టెర్మినల్స్ మరియు వేసైడ్ ఎమినిటీ సెంటర్‌లను ఏర్పాట్లు చేస్తున్నామని తుకుని సాహు పేర్కొన్నారు.
గురువారం రవాణా శాఖ మంత్రి తుకుని సాహు విలేకరులతో మాట్లాడుతూ… ‘హైవేలపై తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని ఇప్పటికే జనచైతన్యం కల్పిస్తున్నాం. సరకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటుంటారు. ఆ సమయంలో రెప్పపాటుతో దుర్ఘటనలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది’ అని తెలిపారు.
Also Read: Coronavirus: నిలోఫర్‌లో చిన్నారికి కరోనా.. ఆక్సిజన్ సాయంతో చికిత్స!
‘భారీ వాహనాల డ్రైవర్లు టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రక్ టెర్మినల్స్ మరియు వేసైడ్ ఎమినిటీ సెంటర్‌లను ఏర్పాట్లు చేస్తాం. 30 జిల్లాల్లో ట్రక్ టెర్మినళ్లు నిర్మిస్తాం. వాటిలో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలుంటాయి. చాయ్, కాఫీలు అందుబాటులో ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు చేశాం. మిగిలిన జిల్లాల కలెక్టర్లు టెర్మినల్స్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని కోరాం’ అని మంత్రి తుకుని సాహు చెప్పారు. గత ఐదేళ్లలో (2018 నుండి 2022 వరకు) రాష్ట్రంలో మొత్తం 54,790 ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 25,934 మంది మరణించగా.. 51,873 మంది గాయపడ్డారు.