Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు

Canadian

Canadian

కెనడాలోని ఆల్బెర్టా మిలిటరీ స్థావరంలో లైవ్-ఫైర్ పోరాట శిక్షణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు కెనడియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయాలు కాగా.. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఎడ్మంటన్ కేంద్రంగా పనిచేస్తున్న 3వ బెటాలియన్, ప్రిన్సెస్ ప్యాట్రిసియాస్ కెనడియన్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన చార్లీ కంపెనీ సభ్యులు గ్రెనేడ్ రేంజ్, శత్రు స్థావరాలపై దాడుల ప్రాక్టీస్ చేస్తుండగా శనివారం ఈ ప్రమాదం జరిగింది.

మిలిటరీ స్థావరానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మంటలను మిలిటరీ అధికారులు గమనించినప్పటికీ.. శిక్షణను కొనసాగించవచ్చని భావించారు. అయితే.. గాలి దిశ అకస్మాత్తుగా మారడంతో కేవలం 36 సెకన్లలోనే మంటలు సైనికులను చుట్టుముట్టాయి. గాలుల ధాటికి క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయని, సైనికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని మేజర్ జనరల్ వేడ్ రట్ల్యాండ్ తెలిపారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని సార్జెంట్ మోర్గాన్ వాంగ్, ప్రైవేట్ షాన్ ఫారెల్, ప్రైవేట్ ఐడాన్ గౌల్డింగ్, ప్రైవేట్ హేడెన్ లైక్‌మార్క్‌లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆంబులెన్సులు, విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఆల్బెర్టాలోని ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలైన కొందరు నెలల తరబడి వైద్య చికిత్స పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

శాంతియుత సమయంలో కెనడా సైన్యంలో జరిగిన అత్యంత దారుణమైన విషాదాలలో ఇది ఒకటని ప్రధాని మార్క్ కార్నీ విచారం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సమాఖ్య భవనాలపై జాతీయ పతాకాన్ని సగం ఎత్తుకు దించాలని ఆదేశించారు. మంటలు చెలరేగడానికి కారణమేమిటనే దానిపై మిలిటరీ , రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ దర్యాప్తు ప్రారంభించాయి.