Formula E race inquiry: ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు నేడు ఆంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. సీజన్ 9 రేసుకు సంబంధించి రెండు కంపెనీలపై ఏసీబీ పలు ప్రశ్నలు సంధించనుంది. ఫార్ములా ఈ సీజన్ 9 కోసం గ్రీన్కో కంపెనీ కేవలం మొదటి విడతగా 30 కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే మిగతా రెండు విడతల డబ్బులు ఫార్ములా ఈ ఆర్గనైజర్ (FEO)కు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీజన్ 10తో పాటు నాలుగు సీజన్లకు గ్రీన్కో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఎందుకు వెనక్కి వెళ్లిందనే అంశంపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది.
Also Read: Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ పై విచారణను నిలిపేసిన కర్ణాటక హైకోర్టు
గ్రీన్కో పై ఏసీబీ అడిగే ప్రశ్నల విషయానికి వస్తే.. మిగిలిన రెండువిడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదని?, ఒప్పందం ఉల్లంఘనకు గల కారణం ఏమిటి?, రేసు నిర్వహణలో సహకారం తగ్గడానికి వెనుక ఉన్న వ్యూహాలు ఏమిటి? అని విచారణ చేపట్టనున్నారు. గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలు రాజకీయ పార్టీలకు అందించిన ఎలక్టోరల్ బాండ్స్ తేదీలపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వబడిన నిధుల వాడుక, వాటి ప్రామాణికతపై ఏసీబీ చర్చించనుంది. సీజన్ 10తో పాటు భవిష్యత్తులో నిర్వహించాల్సిన నాలుగు సీజన్లకు గ్రీన్కో ముందుగా ఒప్పందం చేసుకున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఒప్పందం ఎందుకు నిలిపివేసిందనే అంశాన్ని ఏసీబీ ప్రత్యేకంగా విచారించనుంది.
ఈ కేసు దర్యాప్తులో ఎలక్టోరల్ బాండ్స్ అంశం బయటకు రావడంతో, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్కో వంటి పెద్ద సంస్థల చర్యలు, వాటి వెనుక కారణాలు రాజకీయంగా కూడా చర్చనీయాంశం కావచ్చు. ఈ విచారణలో ఏసీబీ ఎలాంటి సమాచారం సేకరిస్తుందో, ఫార్ములా ఈ రేసులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.