NTV Telugu Site icon

Union Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం.. ఎదురుచూస్తోన్న యావత్‌ భారత్

Budget

Budget

Union Budget 2023: ఆర్థిక మాంద్యం, ఎన్నికలు, ఆర్థిక క్రమశిక్షణ, జనాకర్షణ అనేక సవాళ్ల మధ్య కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సిద్ధమయ్యారు. అత్యంత చాకచక్యంగా అడుగేయాల్సిన తరుణంగా నిర్మలా సీతారామన్‌ ఎలా ముందుకు వెళ్తారనే దానిని యావత్‌ భారతావని ఆసక్తితో గమనిస్తోంది. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడానికి ఎలాంటి ప్రతిపాదనలను సీతారామన్‌ చేయబోతున్నారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అందరినీ సంతృప్తిపరుస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొస్తారోనని ప్రజలు వేచి చూస్తున్నారు. పొరుగున్న ఉన్న శ్రీలంక, పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌ కరోనా మహమ్మారి నుంచి కోలుకునే లోపే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మరో పిడుగులా వచ్చిపడింది. ఆ వెంటే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక ధరలు, నిరుద్యోగంతో కుదేలవుతున్న ప్రజలకు ఉపశమన కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక అంచనాల నేపథ్యంలో అన్ని వర్గాల డిమాండ్లకు అనుగుణంగా, మరీ ముఖ్యంగా పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి ఆశలు నెరవేరతాయనే భావనల మధ్య రానున్న కేంద్ర బడ్జెట్ రానుంది. ఈ ఏడాదిలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే లోపు పూర్తిస్థాయిలో ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్‌ ఇదే కావడంతో వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికీ ప్రాధాన్యమివ్వక తప్పదు.

వరాలు కురుస్తాయా?

రెండో విడత మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇది ఆఖరి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్. వివేకవంతంగా వనరుల వినియోగం, ధరలు పెరగకుండా అభివృధ్ది సాధించేలా ప్రణాళికలు రూపొందించడం, ప్రజలపై పన్నుల భారం మోపకుండా మరిన్ని వనరులను సమకూర్చుకోవడం, అవసరమైన చోట వరాలు కురిపించడం లాంటి లక్ష్యాలను సాధించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేయడమే ‘బడ్జెట్ రూపకల్పన’ అని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టే ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ఆఖరిది కాబట్టి, నెలవారీ జీతం పొందే ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉంది. గృహ రుణాల పరిమితిని పెంచాలనే డిమాండ్ బాగా ఉంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు చాలామందికి ఇది ప్రోత్సాహాన్నిస్తుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊతం వస్తుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవతాయని అంచనా.

రియల్‌పై దృష్టి 

వ్యవసాయ రంగం తర్వాత, అత్యధిక మొత్తంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేది రియల్ ఎస్టేట్ రంగంలోనే. కాబట్టి ఆ రంగంపై కూడా ఎక్కువగా దృష్టి సారిస్తారని అంచనా వేస్తున్నారు. దేశ స్థూలజాతీయోత్పత్తి వృధ్ది రేటు గత ఏడాది నమోదైన 8.7 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతానికి పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే 8 ఏళ్లకు గాను 80 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించాలని ఉత్పత్తి సంస్థల సంఘం డిమాండ్ చేస్తోంది. అలాగే ఆర్ధిక ఉద్దీపనలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాల వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను కూడా పెంచవచ్చని తెలుస్తోంది. అనేక వర్గాల అంచనాలకు తగ్గట్టుగా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడంలో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఏ మేరకు సఫలీకృతమౌతారో ఈ రోజు స్పష్టం కానుంది.

 

కిసాన్‌ సమ్మాన్ నిధి పెంపు!
వరుసగా మూడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాని మోదీ.. దేశంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకుగాను పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో ఏడాదికి మొత్తం రూ.6 వేలును(ఒక్కోదఫా రూ.2వేలు చొప్పున) మోదీ ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బడ్జెట్‌లో ఆ సాయాన్ని మరో రూ.2 వేలకు పెంచే అవకాశం ఉంది. అంటే రూ.2వేలు చొప్పున నాలుగు విడతల్లో ఏడాదికి మొత్తం రూ.8 వేలను ప్రతి రైతు ఖాతాకు జమ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.