NTV Telugu Site icon

Flight Landing: హైవేపై ఫ్లైట్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. కారణమిదే..!

Flight Landing

Flight Landing

ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారులపై విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టారు. సోమవారం చేపట్టిన ఈ క్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు బాపట్ల జిల్లా వేదికైంది.

విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాలంటే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిందే.. కానీ అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులపై దించేందుకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను ఏపీలో నిర్వహించారు.

బాపట్ల జిల్లా కొరిశపాడు-రేణింగవరం జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్‌ కార్యక్రమాన్ని ఎయిర్ ఫోర్స్, హైవే అధికారులు చేపట్టారు. సోమవారం నిర్వహించిన ట్రయల్ రన్‌లో పలు విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. నేషనల్ హైవేపై ట్రాన్స్‌పోర్టు విమానాలు, ఏఎన్ 32, డెన్వర్ కార్గో, సుఖోయ్ ఫైటర్ జెట్, యుద్ధ విమానాలు అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాయి.

ఇదిలా ఉంటే జాతీయ రహదారిపై నిర్వహించిన విమానాల ట్రయల్ రన్ కార్యక్రమానికి సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకించారు. ఈ సందర్భంగా విమానాల ల్యాండింగ్‌ను వీక్షకులు తమ ఫోన్లలో బంధించారు. మరోవైపు ట్రయల్ రన్ కారణంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

హైవేలపై విమానాల ల్యాండింగ్ కోసం.. హైవే అథారిటీ 79 కోట్ల రూపాయలతో 4.1 కిలోమీటర్ల పొడవైన రహదారిని ప్రత్యేకంగా నిర్మించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతీయ రహదారులపైనే విమానాలు ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేసే విధంగా ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య హైవేపై విమానాల ట్రయల్ రన్ నిర్వహించారు.

 

Show comments