Site icon NTV Telugu

President election: రాష్ట్రపతి ఎన్నికపై ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. యూపీ, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలలో ప్రస్తుతం బీజేపీకి గణనీయమైన బలం ఉంది. కాబట్టి పంజాబ్‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి తిరిగి అధికారం దక్కుతుందో లేదో తెలియదు. ఒకవేళ గెలిచినా ఎన్ని సీట్లు వచ్చాయనేదిముఖ్యం. ఎందుకంటే బొటా బొటి మెజార్టీతో ఆయా రాష్ట్రాలలో అధికారం తిరిగి చేజిక్కించుకుంటే రాజ్యసభలో బీజేపీ బలం తగ్గుతుంది. లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో దానికి ఇప్పటికీ మెజార్టీ లేదన్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది జూన్-జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ పరిస్థితి ఈసారి నల్లేరు మీద నడక కాకపోవచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభలు, అసెంబ్లీ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీలలో ఉభయ సభలకు చెందిన 776 మంది ఎంపీలు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీకి 1,098,903 ఓట్లు ఉన్నాయి. ఒక అభ్యర్థి 5,49,452 ఓట్లు సాధిస్తే మెజారిటీ వచ్చినట్టు. ఓట్ల విలువ విషయానికొస్తే 83,824 ఓట్లతో ఉత్తరప్రదేశ్‌ ముందుంది. ఆ తర్వాత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌,ఉత్తరాఖండ్ అసెంబ్లీలలో బీజేపీకి భారీ మెజార్టీ ఉంది. ఐతే, ప్రస్తుతం వివిధ ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలపడానికి ప్రయత్నిస్తున్నందున ఈ రాష్ట్రాలలో బీజేపీ సీట్లు తగ్గితే దానికి కష్టం. ఆట విపక్షాల వైపు తిరుగుతుంది. విపక్షాలు చేతులు కలిపి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకోవటం కష్టం అవుతుంది. అలా జరగకూడదంటే ప్రతిపక్షాల ఓట్ల చీలిక ఒక్కటే మార్గం. ఐతే, ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా కష్టం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన తృణమూల్ కాంగ్రెస్ ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని కలిసి మంతనాలు జరిపారు.

కేసీఆర్‌ త్వరలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్‌ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే మమతా బెనర్జీ కూడా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తారని అర్థమవుతోంది. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, నితీష్‌ కుమార్‌, శరద్‌ పవార్‌లో ఎవరో ఒకరిని బరిలో దించే అవకాశాలను పరిశీలకులు సైతం కొట్టి పారేయటం లేదు. ఐతే, ఈ పరిణామం కాంగ్రెస్‌కు ఏమాత్రం శుభ సూచకం కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఏకమైతే విపక్షంలోఅది ఒంటరి అవుతుంది.

మరోవైపు, తెలంగాణలో బీజేపీ తన పునాదిని విస్తరిస్తున్న తరుణంలో సొంతగడ్డను కాపాడుకోవటం కేసీఆర్ కు అనివార్యంగా మారింది. అందులో భాగంగా ఈ కొత్త రాజకీయ వ్యూహానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆయన బీజేపీతో యుద్దం చేయక తప్పని పరిస్థితి ఎదురైంది.

ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో కలిపి మొత్తం 200కు పైగా లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కనీసం ఇందులో సగం ఎలక్టోరల్ కాలేజీలు వచ్చే రాష్ట్రపతి ఎన్నికలలో కీలకం కాగలవు. ప్రాంతీయ పార్టీలు జతకడితే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఉండదు.

కాబట్టి యూపీతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేడీ, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌ సీపీ, సీపీఐ-ఎం, సీపీఐ తదితర పార్టీల నుంచి మద్దతు కూడగట్టగల సామర్థ్యం ఉన్న ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ లాంటి అభ్యర్థిని ప్రతిపక్షాలు నిలబెడితే బీజేపీకి మరింత కష్టం అవుతుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎన్‌డిఎ అభ్యర్థిగా ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు అన్ని పార్టీల మద్దతు లభించింది. అలాగే యూపీఏ హయాంలో ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ కూడా పలు ఇతర రాజకీయ పార్టీల నుంచి మద్దతు పొందారు. ఐతే, ఇప్పుడు మోడీ, షా హయాంలో విపక్షాలకు సైతం ఆమోదయోగ్యమైన అభ్యర్థి బీజేపీకి దొరుకుతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Exit mobile version