తైవాన్‌లో మరోసారి భూకంపం వణికించింది. తైవాన్‌లోని హువాలియన్‌లో తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఐదుసార్లు భూకంపాలు చోటుచేసుకున్నాయి. సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. తూర్పు తైవాన్‌లోని హువాలియన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్‌షిప్‌లో సోమవారం కేవలం 9 నిమిషాల వ్యవధిలో ఐదు భూకంపాలు సంభవించాయి. సాయంత్రం 5:08 నుంచి 5:17 మధ్య కాలంలో తొమ్మిది సార్లు కంపించింది. తైవాన్‌లోని హువాలియన్ సిటీకి 11 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. భూప్రకంపనలకు ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
రెండు వారాల క్రితం తైవాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. తాజా భూకంపం ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న విషయం ఇంకా తెలియలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది.
సోమవారం జరిగిన ఈ భూకంపం 4.9 నుంచి 5.5 తీవ్రతతో సంభవించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 5:08 గంటలకు హువాలియన్ కౌంటీ హాల్‌కు నైరుతి-నైరుతి దిశలో 26.8 కిలోమీటర్ల దూరంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఆదే ప్రాంతంలో కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలో మొత్తం ఐదు భూకంపాలు జరిగాయి. దీంతో భవనాలు ఒరిగిపోయాయి. ఫర్నిచర్ కింద పడిపోయింది.
ఇది కూడా చదవండి: Memantha Siddham: ‘మేమంతా సిద్ధం’ రేపటి షెడ్యూల్ ఇదే..
