NTV Telugu Site icon

Financial Rules: ఆక్టోబర్ 1నుంచి మారనున్న రూల్స్ ఇవే

Financial Rules

Financial Rules

Financial Rules: సెప్టెంబర్ నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే నెల 1నుంచి అనేక డబ్బు సంబంధిత నియమాలలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. అక్టోబర్ 1, 2023 నాటికి, సెబీ మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ తప్పనిసరి చేసింది. దీంతో పాటు రూ.2000 నోట్ల మార్పిడి గడువు కూడా సెప్టెంబర్ 30తో ముగియనుంది. అక్టోబర్ 1 నుండి మారే కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.

అక్టోబర్ 1నుంచి ఈ నిబంధనలలో మార్పులు
1. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో నామినేషన్ తప్పనిసరి
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలలో నామినేషన్ తప్పనిసరి చేసింది. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ తేదీలోపు ఎవరైనా ఖాతాదారు నామినీ నమోదు చేయకపోతే.. అక్టోబర్ 1 నుండి సదరు ఖాతా స్తంభింపజేయబడుతుంది. మీరు డీమ్యాట్, ట్రేడింగ్ ఆపరేట్ చేయలేరు. సెబీ డిమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల నామినేషన్ గడువును మార్చి 31గా నిర్ణయించింది. తరువాత దానిని మరో ఆరు నెలలు పొడిగించింది. ఖాతాకు మీరు నామినీని జత చేయకపోతే వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయండి.

Read Also:Kolagatla Veerabhadra Swamy: ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులను వాడుకొని బయటకు నెట్టలేదా..? జూ.ఎన్టీఆర్‌ని అణగదొక్కలేదా..?

2. మ్యూచువల్ ఫండ్‌లో నామినేషన్
డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు కాకుండా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు నామినేషన్ తప్పనిసరి చేయబడింది. ఇందుకోసం సెబీ సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. మీరు నిర్ణీత గడువులోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే, మీ ఖాతా స్తంభింపజేయబడుతుంది. దీని తర్వాత మీరు ఇందులో పెట్టుబడి పెట్టలేరు లేదా ఎలాంటి లావాదేవీలు చేయలేరు.

3. టీసీఎస్ నియమాలలో జరుగుతున్న మార్పులు
మీరు వచ్చే నెల నుండి విదేశాలలో టూర్ ప్యాకేజీని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే 7 లక్షల లోపు టూర్ ప్యాకేజీని కొనుగోలు చేస్తే 5 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.7 లక్షల కంటే ఎక్కువ విలువైన టూర్ ప్యాకేజీలకు 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

4. రూ. 2000 నోట్ల మార్పిడికి గడువు
మీరు ఇంకా రూ.2000 నోట్లను మార్చుకోకపోతే, సెప్టెంబర్ 30లోగా ఈ పని చేయండి. సెప్టెంబర్ 2023 నాటికి రూ.2000 నోటును మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది. తర్వాత ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వెంటనే ఈ పనిని పూర్తి చేయండి.

Read Also:Beer Drinkers: ఈ దేశ ప్రజలు బీరు బాటిళ్లతో కాదు.. బక్కెట్లు, బిందెల కొద్ది తాగుతున్నారు

5. జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి
వచ్చే నెల నుంచి ఆర్థిక, ప్రభుత్వ పనుల నిబంధనలలో ప్రభుత్వం భారీ మార్పులు తీసుకురానుంది. అక్టోబర్ 1 నుండి పాఠశాల, కళాశాలలో అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు, ఓటరు జాబితాలో పేరు జోడించడం, ఆధార్ నమోదు, వివాహ నమోదు లేదా ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తు వంటి అన్ని పనులకు జనన ధృవీకరణ పత్రం అవసరం.

6. సేవింగ్స్ ఖాతాలో ఆధార్ తప్పనిసరి
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి అయింది. పీపీఎఫ్, ఎస్ఎస్‎వై, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మొదలైన వాటిలో ఆధార్ సమాచారాన్ని నమోదు చేయడం అవసరం. మీరు దీన్ని చేయకపోతే వెంటనే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి ఈ సమాచారాన్ని నమోదు చేయండి. లేకపోతే అక్టోబర్ 1 నుండి ఈ ఖాతాలు స్తంభింపజేయబడతాయి.