Site icon NTV Telugu

Land Issue: కమ్మగుడలో ఉద్రిక్తత.. యజమానులను భయభ్రాంతులకు చేసిన భూమాఫియా గ్యాంగ్!

Kammaguda Land Issue

Kammaguda Land Issue

వనస్థలిపురం పోలీసు స్టేషన్‌ పరిధి తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కమ్మగుడ భూ వివాదంలో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడిలో పలు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పలు బస్సుల అద్దాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

కమ్మగూడ సర్వే నంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో ప్లాట్స్ ఓనర్స్, పట్టదారులకు మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శివాజీ నగర్ ఫేజ్-2లోని 240, 241, 242లో ప్లాట్ల యజమానులను భూమాఫియా గ్యాంగ్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. 1984లో శివాజీనగర్ ఫేజ్-2 కాలనీలో కొనుగోలు చేసినటువంటి దాదాపు 400 మంది ప్లాట్ యజమానులను కొంతమంది భూబకసురులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్లాట్స్ మావి అంటూ.. ఇందులోకి రావద్దని భూబకసురులు గుండాలను పోగుచేసుకొని తెల్లవారుజామున కబ్జాలోకి రావటానికి ప్రయత్నం చేశారు. ప్లాట్స్ యజమానులు తిరగబడటంతో.. ఇరు వర్గాల మధ్య రాళ్ళ దాడి జరిగింది.

వేధింపులు తాళలేని ప్లాట్స్ యజమానులు పక్కనే ఉన్న పలు బైక్‌లకు నిప్పు పెట్టారు. దాంతో భూబకసురులు కాస్త వెనకడుగు వేశారు. ఇరు వర్గాల మధ్య దాడిలో పలు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు హుటాహుటిన శివాజీ నగర్ ఫేజ్-2కు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Exit mobile version