Centre and Farmer Unions will meet on Sunday: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చే చట్టం సహా పలు సమస్యలపై నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాలతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. అయితే రైతుల డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరడానికి మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడో విడత చర్చలు గురువారం అర్ధరాత్రి ముగిశాయి. అంతకుముందు ఫిబ్రవరి 8, 12 తేదీలలో రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
చండీగఢ్‌లో గురువారం రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చర్చలు జరిపారు. సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగిన సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభమైన చర్చలు.. దాదాపు 5 గంటల పాటు కొనసాగాయి. కేంద్ర మంత్రులు, రైతు సంఘాలు ఒక్కో అంశంపై సవివరంగా చర్చించుకున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
Also Read: Farmers Protest 2024: రైతుల నిరసనలు.. నొయిడాలో 144 సెక్షన్!
పలు అంశాలపై సానుకూలంగా చర్చలు జరిపామని, వచ్చే ఆదివారం నాలుగో విడత చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమావేశం అనంతరం తెలిపారు. పంటకు కనీస మద్దతు ధర, రుణమాఫీకి చట్టపరమైన హామీతో సహా పలు డిమాండ్లపై కేంద్రంతో చర్చ జరిగిందని కిసాన్ మజ్దూర్ మోర్చా (ఎస్కేఎం) ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. కేంద్ర మంత్రులు కొంత సమయం కావాలని కోరారని, ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా సానుకూల ఫలితం రావాలని తమను కోరుకుంటున్నామని పేర్కొన్నారు.