NTV Telugu Site icon

Ravindra Jadeja: జడేజా పాంచ్ పటాకా..వాట్ ఏ కమ్‌బ్యాక్ అంటున్న ఫ్యాన్స్

D

D

రవీంద్ర జడేజా.. టీమిండియాకు లభించిన ఓ ఆణిముత్యం. తన ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు ఒంటి చేత్తో విజయాల్ని అందించాడు జడ్డూ. కానీ గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఇతడు రీఎంట్రీలోనే అదరగొట్టాడు. గతేడాది ఆగస్టు తర్వాత జడేజాకు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. కమ్‌బ్యాక్ మ్యాచ్‌లోనే 5 వికెట్లతో దుమ్మురేపాడు. దీంతో ఆస్ట్రేలియా 177 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను కాదని కెప్టెన్ రోహిత్ ముందుగా జడేజా చేతికే బంతినిచ్చాడు. అయితే లంచ్‌కు ముందు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోయాడు. వరుసగా మూడు వికెట్లతో ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ తీశాడు. క్రమంగా క్రీజులో పాతుకుపోవాలని చూసిన స్మిత్, లబుషేన్ భాగస్వామ్యాన్ని విడదీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు.

Also Read: Bad police : నువ్వు మనిషివా.. ఇక బతికినన్ని రోజులు జైల్లోనే ఉండు.. కోర్టు తీర్పు

మొదట ప్రమాదకరంగా మారుతున్న లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాతి బంతికే మ్యాట్ రెన్‌షాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. లెంత్ బాల్‌ను ఆడలేకపోయిన రెన్‌షా తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక కాసేపటికే డేంజరస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను కూడా జడేజా క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. జడేజా వేసిన బంతిని ముందుకెళ్లి డిఫెండ్ చేయబోగా.. అది కాస్తా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. అవాక్కవడం స్మిత్ వంతైంది. దీంతో 37 రన్స్ చేసిన స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు. జడేజా దెబ్బకు 2 వికెట్లకు 84 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా 109 పరుగులకు 5 వికెట్లతో కష్టాల్లో పడింది. ఇక చివర్లో హ్యాండ్స్‌కాంబ్, మర్ఫీలను ఔట్ చేసి టెస్టుల్లో 11వసారి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో జడేజా పెర్ఫార్మెన్స్ చూసి నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ కమ్‌బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో జడ్డూని కొనియాడుతున్నారు.