Fake Ratings and Reviews: షాపింగ్‌కి వెళ్లి నచ్చిన వస్తువులను కొనడం.. క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ఎన్నో రకాల ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లు.. మరెన్నో రకాల వస్తువులు ఆన్‌లైన్‌లో ఉండడంతో.. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువు ఆర్డర్ పెట్టేస్తున్నారు.. ఇక, ఆన్‌లైన్‌లో ఆఫర్లు కూడా కొన్ని సార్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ ధరకు కూడా కొనేస్తున్నాం అని ఫీల్ అవుతున్నాం.. మరోవైపు, ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలంటే మనం ముందుగా చూసేది సదరు ఉత్పత్తి కింద కనిపించే 5-స్టార్ రేటింగ్. ఎక్కువ స్టార్‌లు ఉంటే మంచి క్వాలిటీ అని నమ్మేస్తాం. మొబైల్, హెడ్‌ఫోన్స్, గృహోపకరణాలు ఏవైనా సరే.. స్టార్ రేటింగ్ మన కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. కానీ, ఇదే అలవాటు ఇప్పుడు కస్టమర్లకు పెద్ద ముప్పుగా మారుతోంది. ఈ-కామర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న కొద్దీ, దానికి సమాంతరంగా మరో ప్రమాదకర ప్రపంచం వెలుగులోకి వచ్చింది. అదే నకిలీ రేటింగ్‌లు, నకిలీ సమీక్షల వ్యవస్థ. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కనిపిస్తున్న అనేక 5-స్టార్ సమీక్షలు నిజమైనవే కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫేక్ సమీక్షల వెనుక వ్యవస్థ
ఇది కొద్ది మంది చేసే మోసం కాదు. ఇది పూర్తిస్థాయి వ్యవస్థ. కొంతమంది డబ్బు కోసం సమీక్షలు రాస్తారు. మరికొందరికి ఉచిత ఉత్పత్తులు ఇస్తూ సానుకూల రివ్యూలు రాయమని ఒప్పిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒకే వ్యక్తి అనేక పేర్లతో ఖాతాలు తెరిచి సమీక్షలు పోస్ట్ చేస్తాడు. తాజాగా కంప్యూటర్ ద్వారా సృష్టించే ఆటోమేటెడ్ సమీక్షలు కూడా ఈ స్కామ్‌లో భాగమయ్యాయి అంటే మరింత షాక్ కలిగించే విషయం..
రివ్యూ ఫార్మింగ్ ఎలా జరుగుతోంది?
రివ్యూ, రేటింగ్‌ను మార్కెట్‌లో దీనిని ఇప్పుడు రివ్యూ ఫార్మింగ్ (Review Farming) అని పిలుస్తున్నారు. క్లోజ్డ్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి కొత్త ఉత్పత్తులను లిస్ట్ చేస్తారు. ఉత్పత్తిని కొనాలి, 5-స్టార్ రేటింగ్ ఇవ్వాలి, ఆ తర్వాత డబ్బును రీఫండ్ చేస్తారు.. లేదా మరో ఉత్పత్తిని ఉచితంగా ఇస్తారు. ఫలితంగా, కొన్ని రోజుల్లోనే ఒక ఉత్పత్తికి వందలాది సానుకూల సమీక్షలు చేరుతాయి.. కస్టమర్‌కు ఉత్పత్తి నమ్మదగినదిగా అనిపిస్తుంది. కానీ ఆ నమ్మకం పూర్తిగా కృత్రిమమైనదనే చెప్పాలి..
నిజాయితీ విక్రేతలకు నష్టం
ఈ నకిలీ రివ్యూలు, రేటింగ్ వ్యవస్థ వల్ల కేవలం వినియోగదారులే కాదు, నిజాయితీగా వ్యాపారం చేసే విక్రేతలు కూడా నష్టపోతున్నారు. నకిలీ సమీక్షలు కొనుగోలు చేయని విక్రేతల ఉత్పత్తులు లిస్టింగ్‌లో వెనుకబడతాయి. మార్కెట్‌లో నిలబడాలంటే ఈ ఆటలో భాగం కావాల్సిందేనని కొందరిపై ఒత్తిడి పెరుగుతోంది.
డిస్కౌంట్ పేరుతో రేటింగ్‌లు
చాలా మంది వినియోగదారులకు ఇది అనుభవమే. ఉత్పత్తి కొనుగోలు చేసిన తర్వాత సమీక్ష ఇస్తే క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ ఇస్తామని సందేశాలు వస్తుంటాయి. అలా చాలా మంది అయిష్టంగానే సానుకూల సమీక్షలు ఇస్తారు. దీంతో ఉత్పత్తి స్టార్ రేటింగ్ కృత్రిమంగా పెరుగుతోంది.
సర్వేలు ఏమంటున్నాయి?
ఈ వ్యవహారంపై LocalCircles నిర్వహించిన సర్వే ప్రకారం, 56 శాతం మంది వినియోగదారులు ఆన్‌లైన్ సమీక్షలు పక్షపాతంతో ఉన్నాయని అంగీకరించారు. పది మందిలో ఆరుగురు రేటింగ్‌లు పూర్తిగా నమ్మదగినవిగా లేవని చెప్పారు. ఐదుగురికి పైగా వినియోగదారులు ప్రతికూల సమీక్షలు తరచూ ప్రచురించబడవని వెల్లడించారు. దీని అర్థం, కస్టమర్ చూసే చిత్రం అసంపూర్ణం. అందుకే 5-స్టార్ రేటింగ్ ఉన్న ఉత్పత్తి కూడా నాణ్యతలో తక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి?
వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం, జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు వచ్చే ఈ-కామర్స్ ఫిర్యాదులు 2018లో 95 వేలుండగా, 2023 నాటికి 4.44 లక్షలకు చేరాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్ రివ్యూ, రేటింగ్ కోసం ప్రత్యేక భారతీయ ప్రమాణాలను ప్రవేశపెట్టింది. సమీక్షలు ఎలా సేకరించాలి, ఎలా ధృవీకరించాలి అనే అంశాలపై పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు.
సంక్షోభంలో కస్టమర్..!
నకిలీ సమీక్షలు ఇప్పుడు కేవలం సోషల్ మీడియా సమస్య కాదు. ఇది నేరుగా వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఒకప్పుడు ఆన్‌లైన్ రివ్యూలను నమ్మిన కస్టమర్లు, ఇప్పుడు ప్రతి 5-స్టార్ రేటింగ్‌ను అనుమానంగా చూస్తున్నారు. అయినప్పటికీ, కొనుగోలు సమయంలో సమీక్షలే ప్రధాన ఆధారం కావడంతో ఈ స్కామ్ కొనసాగుతూనే ఉంది. నిజానికి ప్రశ్న ఫేక్ రివ్యూలు ఉన్నాయా లేదా అనేది కాదు. నమ్మకమే ఒక వ్యాపారంగా మారిపోయిన ప్రపంచంలోకి మనం అడుగుపెట్టామా? అన్నదే అసలు ప్రశ్న. ఈ మార్కెట్‌లో నమ్మకాన్ని అమ్మేవారూ ఉన్నారు, నమ్మకాన్ని కొనేవారూ ఉన్నారు. మధ్యలో చిక్కుకున్న సాధారణ వినియోగదారుడు మాత్రం ఏది నిజమో, ఏది ఫేకో తేల్చుకోలేక సతమతమవుతున్నాడు.
