Site icon NTV Telugu

Fake Doctor: మగ పిల్లాడు కావాలనుకుంటున్నారా..? ఒక్క ఇంజక్షన్‌ చాలంటూ మోసం..!

Fake Doctor

Fake Doctor

Fake Doctor Promises Baby Boy: మగ పిల్లాడు సంతానంగా కావాలనుకుంటున్నారా..? ఒక్క ఇంజక్షన్‌ ఇచ్చానంటే పక్కా మగపిల్లాడే పుడతాడు…!! అంటున్నాడు ఓ దొంగ డాక్టర్‌. క్లినిక్‌ మాటున చిన్నాచితకా రోగాలకు వైద్యం చేస్తున్న వాళ్లు బోలెడు మంది ఉన్నారు. కానీ… ఈ డాక్టర్‌ ఏకంగా కొత్త దుకాణమే తెరిచాడు. మగ సంతానం కావాలనుకున్న వాళ్లు తన వద్ద ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే.. పక్కా మగ పిల్లాడే పుడతాడని మోసం చేస్తున్నాడు. షాద్‌నగర్‌ పరిధిలోని చౌదరిగూడలో శ్రీలక్ష్మి ప్రసన్న క్లినిక్ ముసుగులో నకిలీ ట్రీట్‌మెంట్‌ చేస్తూ… అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు డాక్టర్ శివలింగం.. మగ పిల్లాడు సంతానంగా పుట్టాలని ఆశ ఉన్నవాళ్లు దంపతులు ఈ శివలింగం దగ్గరకు వెళ్లగానే… పలు రకాల టెస్టులు చేయించుకోవాలని చెప్తాడు. తాను చెప్పిన డయాగ్నోస్టిక్‌ సెంటర్‌‌లోనే టెస్టులు చేయించుకోవాలని.. మరోచోట చేయించుకుంటే ట్రీట్‌మెంట్‌ ఇవ్వను అని చెప్తాడు. స్కానింగ్ రిపోర్టులను చూసిన తర్వాత శివలింగం… మరో డ్రామా మొదలుపెడతాడు. మీకు పెద్ద సమస్యే ఉందని… అయినా ఏం పర్వాలేదు మగ పిల్లాడు పుట్టేలా చూస్తాను అని మాయమాటలు చెప్తాడు. కానీ.. మొత్తం 34 వేల రూపాయలు అవుతుందని.. తన ఫీజు సపరేట్‌గా ఉంటుందని చెప్తాడు. ట్రీట్‌మెంట్‌ కావాలనుకుంటే… అడ్వాన్స్‌ రూపంలో 15 వేలు చెల్లించాలని… మిగతా సగం వారం, పది రోజుల్లో చెల్లించాలని సూచిస్తాడు..

READ MORE: Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!

అడ్వాన్స్‌ డబ్బులు అందగానే మరో డ్రామా మొదలు పెడతాడు. తమకు ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అవుతుందని దంపతులు అడిగితే… ఇన్ని రోజులు, అన్ని రోజులు అంటూ ఏం ఉండదని… తన వద్ద ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఉండాల్సిందేనని చెప్తాడు. పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసినా… దంపతులకు ఈ విషయం చెప్పకుండా ఉంటాడు శివలింగం. తిరిగి తిరిగి… ఫీజు కట్టలేక వాళ్లే మానుకునేంత వరకు ఏం చెప్పడు. కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆడపిల్ల పుడితే మరో నాటకం మొదలు పెడతాడు. తాను చెప్పిన డైట్‌ పాటించలేదని… తాను సూచించిన రోజు ట్రీట్‌మెంట్‌ కోసం రాలేదని.. అందుకే ఇలా జరిగిందని.. ఉల్టా నేరం ఆ దంపతులపైనే నెట్టేస్తున్నాడు. ఇతని వద్ద ట్రీట్‌మెంట్‌ కోసం వచ్చిన దంపతులు… సెకండ్‌ ఒపీనియన్‌ కోసం వేరే డాక్టర్‌‌ను కలిస్తే.. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చేసింది బీఏఎంఎస్‌ కదా… ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ ఎలా చేస్తారని ప్రశ్నిస్తే… ఎంతోమందికి ట్రీట్‌మెంట్‌ చేశాను.. 15 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను.. ఇదంతా తనకు కొత్తేం కాదని తనకు తాను సమర్థించుకుంటున్నాడు శివలింగం.. కర్ణాటకలోని ఏదో గుర్తుతెలియని యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్‌ పూర్తి చేశాడని… ఫేక్ సర్టిఫికెట్లతో ఎలాంటి అనుభవం లేకుండా తప్పుడు వైద్యం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు కొందరు దంపతులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్‌ శివలింగం పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. నిజానికి గర్భంలో పిండం తయారైన తర్వాతే ఆడ లేదా మగ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదు. ఇలా మీకు మగపిల్లాడు కచ్చితంగా పుడతాడు అంటే ఇలాంటి వాళ్లను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మో మోసపోవద్దని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు..

Exit mobile version