Fake CBI Officers crime: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం కలకలం సృష్టించింది. నకిలీ సీబీఐ అధికారులుగా నటిస్తూ ఒక ముఠా ఏకంగా రూ.2.5 కోట్లు దోచుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా కేసుతో సంబంధం ఉన్న ఒక మహిళతో సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.కోటికి పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: ACB: ఏసీబీకి వలలో వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్
కోట్లు దోచుకెళ్లిన కేటుగాళ్లు..
ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఘజియాబాద్లోని ఇందిరాపురం సమీపంలో నివస్తున్న వ్యాపారస్థుడు మన్రైత్‌ను పలువురు నకిలీ సీబీఐ అధికారులు టార్గెట్ చేసి అతని కార్యాలయంలో నుంచి దాదాపు రూ.2.5 కోట్ల దోచుకెళ్లారు. ఆగస్టు 19న మన్రైత్ తన స్నేహితుడు రవిశంకర్‌ను తన ఆఫీస్ నుంచి రూ.1.10 కోట్లు తన ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. దీంతో రవిశంకర్ నగదు బ్యాగుతో బయటకు రాగానే, నలుగురు వ్యక్తులు రెండు కార్లలో వచ్చారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. వచ్చిన వాళ్లు తమను తాము సీబీఐ అధికారులమని పరిచయం చేసుకొని రవిశంకర్‌పై దాడి చేసి, డబ్బు బ్యాగును లాక్కున్నారు. తర్వాత ఆయను బలవంతంగా ఆఫీసు లోపలికి తీసుకెళ్లి, అక్కడ ఉన్న మన్రోత్ ఉద్యోగి దీపక్ మహేశ్వరిని కొట్టారు. అనంతరం వారు ఆఫీసులో ఉంచిన మిగిలిన నగదును కూడా తమతో తీసుకెళ్లారు. ఈక్రమంలో ముఠా సభ్యులు వారిద్దరిని కూడా వారితో బందీలుగా తీసుకెళ్లారు. అనంతరం చింతామణి అండర్పాస్ దగ్గర రవిశంకర్‌ను, నిగంబోధ్ ఘాట్ దగ్గర మహేశ్వరిని వదిలి వెళ్లారు.
విషయం తెలుసుకొని మన్రైత్ వివేక్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. డీసీపీ ప్రశాంత్ గౌతమ్ మాట్లాడుతూ.. సంఘటన స్థలం, చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, నిందితులు వాడిన వాహనాలు ఢిల్లీలోని సాకేత్లో ఉన్న ఒక ఎన్జీఓ పేరుతో అద్దెకు తీసుకున్నట్లు తేలిందన్నారు. ఈక్రమంలో ఫరీదాబాద్ నుంచి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశామన్నారు. వారిలో ఒకరు అస్సాంకు చెందిన పపోరి బారువా (31) అనే మహిళ కాగా, మరోకరు తుగ్లకాబాద్‌కు చెందిన దీపక్(32)గా గుర్తించినట్లు తెలిపారు. ఈ మహిళ ఒక ఎన్జీఓకు కార్యదర్శిగా పని చేస్తుందని, నిందితుల నుంచి రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారిని కూడా గుర్తించామని, అతి త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు.
READ ALSO: Asim Iftikhar Ahmed: ముస్లింలు మాత్రమే ఉగ్రవాదులా?: పాక్ ప్రతినిధి ప్రశ్న..
