Fake Birth Certificate Scam: ఇతర రాష్ట్రాల వ్యక్తులకు నకిలీ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సత్యసాయి జిల్లా ఓ మారుమూల సచివాలయాన్ని అక్రమార్కులు అడ్డాగా చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం కొమరేపల్లి సచివాలయంలో జిల్లా గణాంకాల అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇక్కడ ఏడాదిగా 3,982 జనన ధ్రువీకరణ పత్రాల జారీ అయినట్లు కనుగొన్నారు. చిన్న పంచాయతీ నుంచి ఇతర రాష్ట్రాలవారికీ మంజూరు చేసినట్లు బట్టబయలైంది. శ్రీ సత్య సాయి జిల్లా అగలి మండలం అగళి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శితో ప్రాంతంలో ఉన్న సచివాలయ వివరాలు సేకరిస్తున్నారు. అగళి మండలం కోమరేపల్లి సచివాలయం నుంచి వేలకొద్దీ తప్పుడు ధ్రువపత్రాలు మంజూరైనట్లు సమాచారం.
వినయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి 1985 ఆగస్టు 5న జన్మించినట్లు కొమరేపల్లి సచివాలయంలో జనన ధ్రువీకరణ పత్రం మంజూరైంది. అది నకిలీ సర్టిఫికెట్ అంటూ అశీష్కుమార్ గుప్తా అనే వ్యక్తి విజయవాడలోని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో గణాంక, నోడల్ అధికారి కలందర్ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సచివాలయం ద్వారా వివిధ రాష్ట్రాల వారికి 3,982 జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు గుర్తించారు. ఇన్‌ఛార్జి కార్యదర్శి మహేషు విచారించగా, సెప్టెంబరు 14న తాను ఇన్‌ఛార్జి బాధ్యతలు తీసుకుని ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వగా అందులో అప్పటికే 129 జనన ధ్రువీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్నాయని వాటిని ఆపేసినట్లు తెలిపారు. ఎవరైనా హ్యాక్ చేసి ఇలా చేశారా..? లేక లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను మరెవరైనా ఉపయోగిస్తున్నారా? అనేదానిపై నిగ్గు తేల్చేపనిలో ఉన్నారు అధికారులు.. మరోవైపు, ఏడాదిగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
