AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 13న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ.నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటే అవకాశాన్ని కల్పించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 2 కోట్ల, 3 లక్షల 39 వేల 851 మంది పురుషులు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీసు ఓటర్లు 68 వేల 185 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 46వేల 389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది.
3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. మొత్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు. 30వేల 111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించబోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల 459 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్టు ఈసీ తెలిపింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ పర్యవేక్షణ కోసం ముగ్గురు ప్రత్యేక సాధారణ, పోలీసు, వ్యయ అబ్జర్వర్లతో పాటు 50 మందికి పైగా సాధారణ ఎన్నికల అబ్జర్వర్లును ఈసీ నియమించింది. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్ లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.
లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు, 175 శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది అభ్యర్ధులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది అభ్యర్ధులు రేసులో ఉన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో ఆరుగురు మాత్రమే పోటీ చేస్తున్నారు. అత్యధికంగా అభ్యర్ధులు పోటీపడుతున్న నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు.
ఇవాళ సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూత్‌లకు చేరుకుని, మే 13న ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని ఈసీ తెలిపింది. అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటరు ఎవరైనా పోలింగ్ ఏజెంట్‌గా ఉండవచ్చు. పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చు అని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. తెల్లటి స్లిప్పులపై ఓటరు పేరు, సీరియల్ నెంబరు ఉండవచ్చని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకెళ్లకూడదని చెప్పారు. పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ మూడు వాహనాలు అనుమతిస్తారని, పోలింగ్ బూత్‌లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదని తెలిపారు.
ఈసారి ఏపీకి ఓటర్లు కూడా భారీగా తరలివస్తుండటంతో 83 శాతం పోలింగ్ జరిగే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది.గతంలో 79.84శాతం మేర పోలింగ్ నమోదైంది. పోలింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలసి ఈసీ అధికారుల్ని ఆదేశించింది, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
