Euro Cup 2024 Starts From Today: ప్రతిష్టాత్మక ‘యూరో’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు వేళైంది. ‘ఫిఫా’ ప్రపంచకప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే యూరో టోర్నీ.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం 12.30 గంటలకు) ఆరంభమవనుంది. మ్యూనిక్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో గ్రూప్-ఎలో భాగంగా ఆతిథ్య జర్మనీతో స్కాట్లాండ్ పోటీపడుతుంది. 1960లో యూరో కప్ మొదలవగా.. ఇప్పటివరకూ జర్మనీ, స్పెయిన్ జట్లు అత్యధికంగా చెరో మూడు సార్లు విజేతలుగా నిలిచాయి. యూరో టోర్నీ భారత్‌లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
17వ యూరో కప్‌కు జర్మనీ ఆతిథ్యమిస్తోంది. జూన్ 14 నుంచి జులై 14 వరకు 10 నగరాల్లో మొత్తం 51 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఛాంపియన్‌గా నిలిచేందుకు 24 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 24 జట్లు 6 గ్రూప్‌లుగా విడిపోయి.. గ్రూప్ దశలో తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా టీంలతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచే మొత్తం 12 జట్లతో పాటు.. అన్ని గ్రూప్‌ల్లో కలిపి మూడో స్థానంలో నిలిచిన 4 అత్యుత్తమ జట్లు రౌండ్ 16కు అర్హత సాధిస్తాయి. ఆపై క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ ఉంటాయి.
Also Read: Sudheer Babu Tag: సుధీర్ బాబుకి కొత్త టాగ్.. ఏంటో తెలుసా?
2000 తర్వాత రష్యా లేకుండా తొలిసారి యూరో టోర్నీ జరుగనుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా అర్హత రౌండ్లో పోటీపడకుండా ఆ దేశంపై ఐరోపా ఫుట్‌బాల్ సంఘాల కూటమి (యూఈఎఫ్‌ఏ) వేటు వేసింది. చివరగా కరోనా వైరస్ కారణంగా 2020లో జరగాల్సిన టోర్నీని 2021లో నిర్వహించారు. అప్పుడు ఇటలీ టైటిల్ గెలుచుకుంది. మరోవైపు జూన్ 20న అమెరికాలో కోపా అమెరికా టోర్నీ ఆరంభం కానుంది. దాంతో ప్రపంచమంతా ఫుట్‌బాల్ సందడిలో మునిగితేలనుంది.