NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: ప్రభుత్వం మిర్చి రైతును ఆదుకోవాలి.. క్వింటాకు 25 వేల మద్దతు ధర చెల్లించాలి!

Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

రాష్ట్రంలో మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుల్లాగా బతికారని ఎర్ర‌బెల్లి పేర్కొన్నారు.

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్య‌వ‌సాయ మార్కెట్‌ను మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ సంద‌ర్శించారు. మార్కెట్లో రైతులను కలిసి పంటల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రబెల్లితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. మార్కెట్లో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 25 వేల రూపాయల మద్దతు ధర చెల్లించాలంటూ నినాదాలు చేశారు. వారం రోజుల సమయం ఇస్తున్నాం అని, ఈలోపు మిర్చికి 25 వేల మద్దతు ధర ఇవ్వకపోతే బీఆర్ఎస్ తరఫున ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి హెచ్చరించారు.

‘అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. బోనస్ వస్తది అని చెపితే.. రైతులు సన్నరకాలు సాగు చేశారు. రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మిర్చిని రూ.15000 కొనుగొలు చేస్తాం అని చెప్పింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూరియా కొరత వచ్చింది. మార్క్ ఫైడ్ ద్వారా మిర్చిని క్వింటాకు రూ.25000 కొనుగోలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి’ అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు డిమాండ్ చేశారు.