EPFO EEC 2026: ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగి రిటైర్ అయినప్పుడు లేదా నిబంధనల ప్రకారం అవసరమైన సమయంలో ఈ పొదుపు మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అర్హత ఉన్నప్పటికీ గతంలో EPF పరిధిలోకి రాని ఉద్యోగులకు ఇప్పుడు EPFO ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది.
EPFO EEC 2026 అంటే ఏమిటి?
గతంలో EPF కవరేజీకి దూరంగా ఉన్న అర్హులైన ఉద్యోగులను తిరిగి EPF పరిధిలోకి తీసుకురావడమే Employees Enrolment Campaign 2026 (EEC 2026) ప్రధాన ఉద్దేశం. అంటే ఒక సంస్థలో EPFకు అర్హత ఉన్నప్పటికీ నమోదు కాకుండా మిగిలిపోయిన ఉద్యోగులను ఈ క్యాంపెయిన్ ద్వారా చేర్చుకునే అవకాశం ఉంటుంది. 2026 జూన్ 29 నుంచి EEC 2026 అమల్లోకి వచ్చింది. అర్హత ఉన్న ఉద్యోగులను 2026 అక్టోబర్ 31 వరకు ఈ క్యాంపెయిన్ కింద నమోదు చేసుకోవచ్చు. అయితే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా తమ ఉద్యోగుల రికార్డులను ముందుగానే పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించాలని EPFO సంస్థలకు సూచించింది.
ఎవరు అర్హులు?
EPF పరిధిలోకి రావాల్సినప్పటికీ గతంలో నమోదు కాని ఉద్యోగులను EEC 2026 కింద చేర్చుకోవచ్చు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా యజమాని ఉద్యోగిని డిక్లేర్ చేసే తేదీ నాటికి ఆ ఉద్యోగి జీవించి ఉండటంతో పాటు అదే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. దీనితో పాటు EEC 2026 కింద నిర్దేశించిన ఇతర అర్హతలు, నిబంధనలను కూడా పాటించాలి.
ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం?
PFలో చేరడం ద్వారా ఉద్యోగులకు భవిష్యత్ కోసం క్రమబద్ధమైన పొదుపు ఏర్పడుతుంది. నిబంధనలకు అనుగుణంగా పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు EPFలో నమోదు కాని ఉద్యోగులకు ఈ క్యాంపెయిన్ ఉపయోగకరంగా మారనుంది.
ఉద్యోగులు ఏం చేయాలి?
EEC 2026 కింద నమోదు చేసుకునే ఉద్యోగులు UMANG యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత Universal Account Number (UAN)ను రూపొందించాలి. అనంతరం ఉద్యోగికి సంబంధించిన EPF కాంట్రిబ్యూషన్లను యజమాని Electronic Challan Cum Return (ECR) ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
యజమానులు ఏం చేయాలి?
సంస్థలు ముందుగా తమ ఉద్యోగుల వివరాలను పూర్తిగా పరిశీలించాలి. గతంలో EPFలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని గుర్తించాలి. ఇందుకోసం జీతాల రికార్డులు, ఉద్యోగ వివరాలు, EPF రికార్డులను పరిశీలించాలి. అర్హత ఉన్న ఉద్యోగులు గుర్తిస్తే EEC 2026 కింద అవసరమైన నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. అందువల్ల EPF పరిధిలోకి రావాల్సి ఉండి గతంలో నమోదు కాని ఉద్యోగులు, అలాగే సంబంధిత సంస్థలు అక్టోబర్ 31, 2026లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం కీలకం.

