EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి

Epfo

Epfo

EPFO PF Interest 2025: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.25 శాతం వడ్డీని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. జూలై 15 గడువులోగా సుమారు 34 కోట్ల ఖాతాలకు వడ్డీ బదిలీ ప్రక్రియను పూర్తి చేసినట్లు EPFO వెల్లడించింది. మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని సూచిస్తోంది. అయితే కొందరి పాస్‌బుక్‌లో వడ్డీ మొత్తం ఇంకా కనిపించకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాస్‌బుక్ అప్‌డేట్ ఆలస్యమైనా వడ్డీపై ఎలాంటి ప్రభావం ఉండదని EPFO స్పష్టం చేసింది.

చరిత్రలో తొలిసారిగా వేగంగా వడ్డీ జమ

ఈసారి EPFO తన చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయి ఆటోమేషన్ ద్వారా వడ్డీ జమ ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. గతంలో పీఎఫ్ వడ్డీ సాధారణంగా సెప్టెంబర్ లేదా నవంబర్ నెలల్లో సభ్యుల ఖాతాల్లో జమ అయ్యేది. అయితే ఈ ఏడాది కొత్త సాంకేతిక వ్యవస్థ కారణంగా జూలై మధ్య నాటికే వడ్డీ బదిలీ పూర్తయింది. కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ముందుగా ప్రకటించినట్లుగానే సుమారు రూ.1.44 లక్షల కోట్ల వడ్డీ సభ్యుల ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం.

35 కోట్ల సభ్యుల ఖాతాల నిర్వహణ

ప్రస్తుతం EPFO దేశవ్యాప్తంగా సుమారు 35 కోట్ల సభ్యుల ఖాతాలను నిర్వహిస్తోంది. వీటిలో 8 కోట్లకు పైగా క్రియాశీల కంట్రిబ్యూషన్ ఖాతాలు ఉన్నాయి. మొత్తం మీద దాదాపు రూ.32 లక్షల కోట్ల ఆస్తులను సంస్థ నిర్వహిస్తోంది. 8.25 శాతం వడ్డీ ప్రకారం లెక్కిస్తే, పీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్న సభ్యుడికి ఏడాదికి సుమారు రూ.82,500 వడ్డీ లభిస్తుంది. అదే రూ.50 లక్షల నిల్వ ఉన్న సభ్యుడికి దాదాపు రూ.4.12 లక్షల వరకు వడ్డీ జమ అవుతుంది.

CITES ప్లాట్‌ఫామ్‌తో భారీ మార్పులు

EPFO అమలు చేసిన Centralized IT Enabled Services (CITES) ప్లాట్‌ఫామ్ ఈ వేగవంతమైన ప్రక్రియకు ప్రధాన కారణంగా నిలిచింది. గతంలో దేశంలోని 123 ప్రాంతీయ కార్యాలయాలు తమ తమ డేటాబేస్‌లను విడివిడిగా నిర్వహించేవి. దీంతో సభ్యుల వివరాల ధృవీకరణ, వడ్డీ లెక్కింపు, క్రెడిట్ ప్రక్రియలకు ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు అన్ని ప్రాంతీయ డేటాబేస్‌లను ఒకే జాతీయ కేంద్రీకృత డేటాబేస్‌లో విలీనం చేయడంతో ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది.

1,700 కోట్ల రికార్డులు.. 1,400 కోట్ల లావాదేవీలు

సవరించిన ఐటీ వ్యవస్థలో భాగంగా సుమారు 1,700 కోట్ల రికార్డులు, యజమానుల వివరాలు, అలాగే 1,400 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు ఒకే కేంద్ర వ్యవస్థలోకి తీసుకువచ్చారు. జూన్ 30 నాటికి డేటాబేస్ బదిలీ పూర్తి కాగా, జూలై 1, 2 తేదీల్లో వడ్డీ లెక్కింపు చేపట్టారు. అనంతరం ఖాతాల్లో జమ చేసే ముందు వివరాలను మరోసారి ధృవీకరించారు. దీంతో డేటా లోపాలు తగ్గడంతో పాటు వడ్డీ చెల్లింపులు, క్లెయిమ్ సెటిల్‌మెంట్లు, ఉపసంహరణలు వంటి సేవలు కూడా పూర్తిగా మారిపోయాయి..

PF బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి

1. EPFO పాస్‌బుక్ పోర్టల్ ద్వారా
EPFO పాస్‌బుక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. UAN నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. క్యాప్చా నమోదు చేసిన తర్వాత PF నంబర్‌ను ఎంచుకుంటే పాస్‌బుక్, వడ్డీ వివరాలు కనిపిస్తాయి.

2. SMS ద్వారా
మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి EPFOHO UAN ENG (లేదా మీకు కావాల్సిన భాష కోడ్) అని టైప్ చేసి 7738299899కు SMS పంపండి. వెంటనే PF బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో అందుతాయి.

3. UMANG యాప్ ద్వారా
UMANG యాప్‌లో లాగిన్ అవ్వండి. Employee Centric Servicesలోకి వెళ్లి View Passbook ఎంపికను ఎంచుకోండి. UAN నమోదు చేసి OTPతో ధృవీకరించగానే బ్యాలెన్స్ కనిపిస్తుంది.

4. మిస్డ్ కాల్ ద్వారా
మీ UANకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. రెండు రింగుల తర్వాత కాల్ కట్ అవుతుంది. అనంతరం PF బ్యాలెన్స్ వివరాలు SMS రూపంలో మీ మొబైల్‌కు వస్తాయి.

EPFO చేపట్టిన డిజిటల్ సంస్కరణలతో ఈసారి వడ్డీ జమ ప్రక్రియ గతంతో పోలిస్తే ఎంతో వేగంగా పూర్తయింది. ఒకవేళ మీ పాస్‌బుక్‌లో వడ్డీ వెంటనే కనిపించకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంత సమయం తర్వాత వివరాలు అప్‌డేట్ అవుతాయని EPFO సభ్యులకు సూచించింది.