ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఆదివారం అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 135 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఓపెనర్ టామ్ బాంటన్ (121) అద్భుత సెంచరీతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్ 1-1తో సమం చేసింది. కేవలం రెండు రోజుల క్రితమే పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో 131 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, ఈ మ్యాచ్‌లో పూర్తి భిన్నంగా ఆడి భారీ స్కోరు సాధించింది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. 19 పరుగుల వద్దే బెన్ డకెట్ అవుట్ అయినా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇంగ్లాండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. టామ్ బాంటన్, జో రూట్ (62) రెండో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక రెండో వికెట్ భాగస్వామ్యం. బాంటన్ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేసి తన రెండో వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో వికెట్ కీపర్ జోర్డాన్ కాక్స్ (67), విల్ జాక్స్ (54 నాటౌట్) వేగంగా ఆడగా, ఆఖరి ఓవర్లో గస్ అట్కిన్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేసింది.
356 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్లు గస్ అట్కిన్సన్ (4/27), సోనీ బేకర్ (1/43) నిప్పులు చెరగడంతో ఆసీస్ ఏడు ఓవర్లలోనే 29 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, కూపర్ కొనోలీ, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో మాట్ రెన్షా (63), కామెరూన్ గ్రీన్ (64) కొంతసేపు పోరాడినప్పటికీ, రన్‌రేట్ పెరిగిపోవడంతో ఆసీస్ ఒత్తిడికి గురైంది. చివరికి జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన యార్కర్‌తో స్పెన్సర్ జాన్సన్‌ను బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 220 పరుగులకే ఆలౌట్ అయింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే బుధవారం హోబర్ట్ వేదికగా జరగనుంది.

