Geoffrey Boycott Health Update: ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే గొంతు క్యాన్సర్ చికిత్సలో భాగంగా శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికెళ్లిన ఆయన ఆదివారం తిరిగి ఆసుపత్రిలో చేరారు. 83 ఏళ్ల బాయ్‌కాట్ ప్రస్తుతం నిమోనియాతో బాధపడుతున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన కుమార్తె ఎమ్మా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
‘మా నాన్న జెఫ్రీ బాయ్‌కాట్ కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఆయనకు మద్దతుగా ఉన్న అభిమానులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. దురదృష్టవశాత్తూ నాన్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిమోనియా కారణంగా ఆయన ఆహరం తినలేకపోతున్నారు. కనీసం ద్రవ పదార్థాలు కూడా తీసుకోలేకతున్నారు. నాన్న ఆసుపత్రిలో వెంటిలేషన్ మీద ఉన్నారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాం’ అని బాయ్‌కాట్ అధికారిక ఖాతాలో ఎమ్మా పేర్కొన్నారు.
Also Read: Prabhas Number 1: ఇండియా నంబర్ వన్ హీరోగా ప్రభాస్.. నం.1 హీరోయిన్ ఎవరంటే?
జెఫ్రీ బాయ్‌కాట్ తొలిసారిగా 2002లో క్యాన్సర్ బారిన పడ్డారు. మహమ్మారితో చాలా రోజులు పోరాడారు. కీమో థెరఫీ చేయించుకుని కోలుకున్నారు. 2024 మే నెలలో క్యాన్సర్ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇంతలోనే నిమోనియా వచ్చింది. దాంతో అతడి ఆరోగ్యం విషమించింది. కెరీర్‌లో ఇంగ్లండ్ తరఫున 108 టెస్టుల్లో 8,114 పరుగులు చేశారు. 36 వన్డేల్లో 1082 రన్స్ బాదారు. 100 ఫస్ట్-క్లాస్ సెంచరీలు కూడా నమోదు చేశారు. 1978లో కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్ అనంతరం వార్తాపత్రిక కాలమిస్ట్‌గా, బ్రాడ్‌కాస్టర్‌గా కెరీర్‌ని కొనసాగించారు. హార్ట్ బైపాస్ సర్జరీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో కామెంటేటర్ కెరీర్‌ను కూడా ముగించాడు.