Big Blow for England as Chris Woakes Ruled Out of 5th Test: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19) క్రీజులో ఉన్నారు. ఓవల్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండడంతో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోయారు. కరుణ్ నిలవకపోతే తొలి రోజు భారత్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. రెండో రోజు కరుణ్ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అయితే టీమిండియాకు ఓ శుభవార్త.
రెండో రోజు ఆటకు ముందే ఆతిథ్య ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భుజ గాయం కారణంగా ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. బ్యాటింగ్, బౌలింగ్‌కు వోక్స్ అందుబాటులో ఉండడు. సిరీస్ ముగిసిన తర్వాత వోక్స్ గాయంపై స్పష్టత వస్తుందని ఈసీబీ చెప్పింది. తొలి రోజు లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో వోక్స్ ఎడమ భుజానికి గాయమైంది. దాంతో అతను మైదానం విడిచి వెళ్లాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
Also Read: ENG vs IND: అందరికీ ఛాన్స్‌లు ఇస్తున్నారు.. మా అబ్బాయికి ఇవ్వరా? డిప్రెషన్‌లోకి వెళ్లాడు
క్రిస్ వోక్స్ ఈ టెస్ట్ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లలోనూ ఆడాడు. ఓవల్ టెస్ట్‌కు అతడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. బంతితో మాత్రమే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించాడు. 2025 టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో వోక్స్ 9 ఇన్నింగ్స్‌లలో 52.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 10.66 సగటుతో 64 పరుగులు చేశాడు. వోక్స్ దూరమవడం టీమిండియాకు శుభవార్త అనే చెప్పాలి. వోక్స్ లేని ఇంగ్లీష్ బౌలింగ్ దాడి కాస్త బలహీనపడనుంది. భారత్ ఇక ఐదవ టెస్ట్ గెలిచేనా? అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
