Site icon NTV Telugu

ENG vs IND: సెలెక్షన్‌ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్‌

Cheteshwar Pujara

Cheteshwar Pujara

ఆటకు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటున్నా అని, ఎప్పుడు అవకాశం లభించినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అని టీమిండియా సీనియర్ బ్యాటర్‌ చెతేశ్వర్‌ పుజారా తెలిపాడు. సెలెక్షన్‌ తన చేతుల్లో లేదని, ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. కచ్చితంగా క్రికెట్‌ ఆడటాన్ని కొనసాగిస్తా అని, భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశం లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని పుజారా పేర్కొన్నాడు. ‘నయా వాల్’గా పేరు తెచ్చుకున్న పుజారా.. ఫామ్ లేమితో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. జూన్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరగా ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత టీమిండియా తరపున ఆడలేదు. ప్రస్తుతం అతడు సెలెక్టర్ల దృష్టిలో లేడు.

ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చెతేశ్వర్‌ పుజారా.. తనకు మళ్లీ భారత్ తరఫున ఆడాలనే కోరికను బయటపెట్టాడు. ‘నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అవకాశం లభిస్తే ఆడేందుకు ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నా. నా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ సాధన చేస్తున్నా. నా నియంత్రణలో ఉన్న ప్రతి దాన్ని పక్కాగా అమలు చేస్తున్నా. ఆటకు నేను ఎప్పుడూ దగ్గరగానే ఉంటున్నా. భారత జట్టులో అవకాశం ఎప్పుడు లభించినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. అయితే సెలెక్షన్‌ నా చేతుల్లో లేదు, ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఒకటి మాత్రం చెబుతా.. క్రికెట్‌ ఆడటాన్ని నేను కొనసాగిస్తా. టీమిండియాకు మళ్లీ ఆడే అవకాశం లభిస్తే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు’ అని పుజారా తెలిపాడు.

Also Read: ENG vs IND: విరాట్ కోహ్లీ స్థానంలో ఆడేదెవరు?.. విషయం చెప్పేసిన పంత్!

ఇంగ్లండ్, భారత్ టెస్ట్ గురించి చెతేశ్వర్‌ పుజారా స్పందించాడు. ‘ఇంగ్లండ్‌లో విజయం సాధించాలంటే.. భారత జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయడం కీలకం. అక్కడి పరిస్థితులు కొత్త కుర్రాళ్లకు సవాలే. మొదటిసారి టెస్టు ఆడే ముందు సన్నద్ధత అవసరం. ప్రస్తుతం భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండడం సానుకూలాంశం. చాలా రోజులు మన ఆటగాళ్లకు సాధన చేసేందుకు సమయం దొరికింది. తొలి టెస్టు ప్రారంభమయ్యే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండి.. ప్రాణాకికలను ఆచరణలో పెడితే ఫలితం ఉంటుంది. వీలైనంత త్వరగా జో రూట్‌ను ఔట్‌ చేయాలి. హ్యారీ బ్రూక్‌ కూడా బాగా రాణిస్తున్నాడు, అతడు కూడా కీలకమే. టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా కీలకం. ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు అతడే సమాధానం’ అని పుజారా చెప్పుకొచ్చాడు.

Exit mobile version