India playing 11 against England for 4th Test 2025: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓడి, రెండో టెస్టులో గెలిచిన భారత్.. మూడో టెస్టులో తడబడి సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. నేడు మాంచెస్టర్‌లో కీలక పోరుకు సిద్ధమైంది. నాలుగో టెస్టు ముంగిట భారత జట్టుకు అన్ని ప్రతికూలాంశాలే ఉన్నాయి. ఓవైపు గాయాల బాధ.. మరోవైపు తుది జట్టులో ఎవరుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మాంచెస్టర్‌లో గెలుపు లేదా డ్రా చేసుకుంటేనే సిరీస్‌పై ఆశలు నిలుస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎలా ఆడుతుందో చూడాలి.
భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. ఓపెనర్లు లోకేష్ రాహుల్, యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం ఇవ్వాల్సి ఉంది. సాయి సుదర్శన్ మళ్లీ జట్టులోకి రానున్నాడు. నితీశ్ స్థానంలో అతడు ఆడే ఆడే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన కరుణ్ నాయర్‌కు మరో అవకాశం దక్కనుంది. మూడో స్థానంలో సాయి ఆడే అవకాశముంది. గాయంతో ఇబ్బంది పడ్డ రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడనుండడం కలిసొచ్చే అంశం. రవీంద్ర జడేజా మంచి లయలో ఉండడం సానుకూలాంశం.
బౌలింగ్ విభాగం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడని అనుకున్నా.. జట్టును గాయాల బాధ వెంటాడుతున్న నేపథ్యంలో తప్పక ఆడాల్సి ఉంది. బుమ్రా సహా మహమ్మద్ సిరాజ్ జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. దాంతో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలో ఒకరు ఆడనున్నారు. అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే కొట్టిపారేయలేం. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేసర్లకు అనుకూలం అన్న అంచనాల నేపథ్యంలో శార్దూల్‌కు ఛాన్స్ దక్కొచ్చు.
Also Read: Today Astrology: బుధవారం దినఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలే లాభాలు!
లార్డ్స్‌లో మంచి విజయం సాధించిన ఇంగ్లండ్ నాలుగో టెస్టులో ఉత్సాహంగా బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్ రాకతో బౌలింగ్ బలం మరింత పెరిగింది. వోక్స్, కార్స్‌లు కూడా రాణిస్తున్నారు. రూట్, బ్రూక్, స్మిత్, డకెట్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. స్టోక్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరోసారి అందరూ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు. గాయపడ్డ షోయబ్ బషీర్ స్థానంలో డాసన్‌ను తుది జట్టులో ఆడిస్తోంది. విజయోత్సాహంలో ఉన్న ఇంగ్లండ్‌ను ఆపాలంటే భారత్‌కు పెను సవాలే. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేసర్లకు అనుకూలం. మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
తుది జట్లు (అంచనా):
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, రూట్, పోప్, బ్రూక్, స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, డాసన్, వోక్స్, కార్స్, ఆర్చర్.
భారత్: రాహుల్, జైస్వాల్, సుదర్శన్, గిల్ (కెప్టెన్), పంత్, కరుణ్ నాయర్, జడేజా, సుందర్/శార్దూల్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్/కాంబోజ్.
