Election Commission: విభేదాలకు కారణమైన ఫారం 6పై ఈసీఐ ఫుల్ క్లారిటీ..

Eci

Eci

Election Commission: కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే ‘ఫామ్-6’లో ఎలాంటి మార్పులూ చేయలేదని ఎలక్షన్ కమిషన్ (ECI) స్పష్టం చేసింది. ఓ జాతీయ మీడియా నిర్వహించిన పరిశోధనలో.. కొత్త ఓటర్ల దరఖాస్తు ఫామ్‌లో తీసుకొచ్చిన కొన్ని మార్పులపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బయటపడింది. అయితే, తాము అసలు ఫామ్-6ను మార్చలేదని, ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కోసం కేవలం ఒక ప్రత్యేక అనుబంధ పత్రాన్ని (అనెక్సర్) మాత్రమే జత చేశామని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. గడిచిన 10 నెలల కాలంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న పలు నిర్ణయాలపై కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి దాదాపు 14 అంశాల్లో తమ అసమ్మతిని రికార్డు చేశారు. అందులో ఈ ఫామ్-6 మార్పుల వ్యవహారం కూడా చాలా కీలకమైనది. సాధారణంగా మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకునేవారు ఫామ్-6 నింపుతుంటారు. ఇందులో వయస్సు, నివాస ధృవీకరణ వంటి ప్రాథమిక వివరాలు మాత్రమే అడుగుతారు. కానీ జూలై నుంచి ఈ ఫామ్ ఆన్‌లైన్ వెర్షన్‌లో ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు. దరఖాస్తుదారులు, వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాతలు చివరిసారిగా జరిగిన ‘SIR’ తర్వాత ఓటర్ల జాబితాలో నమోదయ్యారా లేదా అనే విషయాన్ని తెలపాలని అందులో కోరారు. దీన్ని “తప్పనిసరి కాదు” (non-mandatory) అని పేర్కొన్నప్పటికీ, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దరఖాస్తును ముందుకు పంపడం గానీ, సబ్‌మిట్ చేయడం గానీ వీలుపడకుండా డిజైన్ చేశారు. చాలా రాష్ట్రాల్లో చివరిసారిగా SIR అనేది 2000ల ఆరంభంలో జరిగింది.

ముఖ్యంగా ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960’ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక సవరణలు చేయకుండానే, ఈ SIR డిక్లరేషన్‌ను ఆన్‌లైన్ ఫామ్‌లో నేరుగా చేర్చడంపైనే ఈ ఇద్దరు కమిషనర్లు గళమెత్తారు. మే నెలలోనే వివేక్ జోషి ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. ప్రభుత్వం చట్టసవరణ చేయకుండా ఫామ్-6ను మార్చడం కుదరదని హెచ్చరించారు. జోషి అభిప్రాయాన్ని సుఖ్‌బీర్ సింగ్ సంధూ సమర్థిస్తూ, చట్టబద్ధత లేని ఈ నిర్ణయం పూర్తిగా అనధికారికమని, ఇల్లీగల్ అని పేర్కొంటూ వెంటనే ఆ విభాగాన్ని తొలగించాలని స్పష్టం చేశారు. కమిషనర్లు ఎంతగా అభ్యంతరం చెప్పినా ఆ నిబంధనను ఈసీ తొలగించలేదు. మాజీ సిఇసి ఓపి రావత్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసాలు కూడా జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంధూ, జోషి లేవనెత్తిన అభ్యంతరాలకు మద్దతు పలికారు.

ఇక, ఈ విమర్శలపై ఎలక్షన్ కమిషన్ సాంకేతిక పరమైన వివరణ ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఒరిజినల్ ఫామ్-6ను తాము ముట్టుకోలేదని, SIR ప్రక్రియ కోసం మాత్రమే అదనంగా ఒక డిక్లరేషన్ పత్రాన్ని పక్కన చేర్చామని పేర్కొంది. బీహార్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించకముందు, అంటే 2025 జూన్ 24న జారీ చేసిన ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేవారు లేదా వేరే నియోజకవర్గానికి మారేందుకు ఫామ్-8 నింపేవారు, ఇకపై తమ వివరాలకు మద్దతుగా ‘అనెక్సర్-డి’ అనే అదనపు డిక్లరేషన్ ఫామ్‌ను కచ్చితంగా పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపింది. ఈ రకంగా ప్రధాన ఫామ్-6 మారలేదని చెప్తూనే, అనెక్సర్-డి పేరుతో ఆ కొత్త నిబంధనను ఓటర్లపై అమలు చేస్తోంది.