NTV Telugu Site icon

Election Commission: తప్పుడు కథనాలపై స్పందించిన ఈసీ.. ఏం చెప్పిందంటే?

Ec

Ec

ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘంపై బురదజల్లే ప్రయత్నం చేస్తు్న్నాయి. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని.. తరచూ ఆరోపిస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ఈసీ పలు వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా తప్పుడు కథనాల వ్యాప్తి, దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈసీ ఆరోపించింది. పోలైన ఓట్ల సంఖ్యలో మార్పులు చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి అయిదు దశలకు సంబంధించి నమోదైన ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల గణాంకాలను తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. నియోజకవర్గాల వారీగా చూసుకునేలా అవకాశం కల్పించింది.

READ MORE: Anantnag-Rajouri: చరిత్ర సృష్టించిన అనంత్‌నాగ్-రాజౌరీ పోలింగ్.. 35 ఏళ్లలో ఇదే తొలిసారి

ఇటీవల ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌)’ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఓటింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో ఉంచాలని అభ్యర్థిస్తూ… సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే అయిదు దశల పోలింగ్‌ ముగిసి.. మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఈసీకి ఆదేశాలు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నవారి కచ్చితమైన సంఖ్యను వెల్లడించేందుకు ‘ఓటర్‌ టర్నవుట్‌’ డేటా ఫార్మాట్‌ను మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు ఈసీ తాజాగా వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య, నమోదైన పోలింగ్ శాతం ద్వారా ఎంతమంది ఓటేశారనేది తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు వివరాలు ఇప్పటికే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని గుర్తు చేసింది.

Show comments