నేడు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం కానుంది. ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర పార్టీలతో ఈసీ సమావేశం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ తప్పనిసరి, ఓటర్ల తుది జాబితా ఖరారుపై చర్చ జరగనుంది. ట్రయల్ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక అభ్యర్థిగా పెట్టాలని ఎన్నికల కమిషన్ అనుకుంటోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. సర్పంచ్ పదవికి జరిగే ఎన్నికలలో నోటాను ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’గా పరిగణించడం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకుంటుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు:
1. ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’గా పరిగణించడం.
2. పోటీ చేస్తున్న అభ్యర్థి, కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా అత్యధిక సంఖ్యలో చెల్లుబాటు అయ్యే సమాన ఓట్లను పొందినట్లయితే, పోటీ చేస్తున్న అభ్యర్థి (నోటా కాదు) ఎన్నికైనట్లు ప్రకటించబడుతుంది.
3. ఏదైనా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ వ్యక్తిగతంగా ‘కల్పిత ఎన్నికల అభ్యర్థి’ అంటే నోటా కంటే తక్కువ ఓట్లు పొందినట్లయితే.. పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఎవరూ ఎన్నికైనట్లు ప్రకటించబడరు.
4. ఎవరు ఎన్నిక కానట్లు అయితే ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించబడుతుంది. అంతేకాకుండా నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తిరిగి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి/పోటీ చేయడానికి అర్హులు కారు.
5. తిరిగి ఎన్నికలో నోటాకు మళ్లీ అత్యధిక ఓట్లు వస్తే.. తదుపరి ఎన్నికలు నిర్వహించబడవు. అత్యధిక ఓట్లు (నోటా మినహా) ఉన్న పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించబడుతుంది.