Site icon NTV Telugu

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధమైన ఈసీ.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Elections

Elections

Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌, కార్పొరేషన్‌ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టైమ్‌లైన్స్‌పై కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమావేశంలో భాగంగా కలెక్టర్లకు ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల వివరాల ప్రచురణపై డెడ్‌లైన్లు నిర్దేశించారు. జనవరి 12వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. 13వ తేదీ నాటికి పోలింగ్‌ స్టేషన్ల వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను విడుదల చేసి, వెంటనే టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

Read Also: Animal Blood Racket: 1000 లీటర్ల గొర్రె, మేకల రక్తం పట్టివేత.. జంతు రక్తంతో అక్రమ వ్యాపారం..!

ఇక, జనవరి 16వ తేదీ లోపు పోలింగ్‌ స్టేషన్ల పూర్తి వివరాలతో పాటు ఫోటోలతో కూడిన తుది జాబితా, తుది ఓటర్ల జాబితాను వార్డు పరిధిలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ చర్య ద్వారా ఓటర్లకు తమ పోలింగ్‌ కేంద్రం, వివరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులపై కూడా ఈసీ కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది నియామకం, రిటర్నింగ్ ఆఫీసర్లు (RO), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు (ARO), ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్/సర్వైలెన్స్ స్క్వాడ్స్ను నియమించి, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని కమిషన్‌ సూచించింది. మరోవైపు, ఎన్నికల ఏర్పాట్లు పారదర్శకంగా, సమయపాలనతో జరిగితేనే ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్లు ఈ డెడ్‌లైన్లను కచ్చితంగా పాటిస్తూ, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అయితే, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎన్నికల వేళ కీలకంగా మారనున్నాయి. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలనే లక్ష్యంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version