ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని సోన్‌భద్రలో ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఖనిజ సంపద, థర్మల్ పవర్ ప్లాంట్‌లకు ప్రసిద్ధి చెందిన సోన్‌భద్ర జిల్లాలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్థి నష్టం గురించి ఇంకా వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఈ భూకంప ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
READ MORE: TG Polycet 2024 Results: రేపు పాలిసెట్ ఫలితాల విడుదల..
NCS ఈ వివరాలను తన ‘X’ ఖాతాలో పోస్టు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం అక్షాంశం 23.9 N, రేఖాంశం 94.10 E , 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు NCS పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున 2:28 గంటలకు (IST) భూకంపం సంభవించింది. కాగా.. ఉత్తర భారతదేశం, హిమాలయాల ప్రాంతం, నేపాల్‌లపై తరచూ ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంటుంది. ఇక సాధారణంగా మామూలు భూ ప్రకంపనలు అయితే చాలా సార్లు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి భారీ తీవ్రతతో వచ్చిన భూకంపాలు ఆస్తి, ప్రాణ నష్టాన్నే మిగులుస్తున్నాయి. గతేడాది ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం చోటు చేసుకుంది. తాజాగా నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం ధాటికి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు సంభవించాయి.